SriLanka Cricket : శ్రీలంక.. క్రికెట్ ఆడే చిన్న దేశాల్లో ఒకటి. ద్వీప దేశమైన లంకేయులు భారత్ తరహాలోనే క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా క్రికెట్‌ను ప్రోత్సహిస్తోంది. ఇక శ్రీలంక క్రికెట్ జట్టు 1990 దశకం మధ్యలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలపాటు జెంటిల్‌మెన్ గేమ్‌పై ఏకఛత్రాధిపత్యం చలాయించి, ఈ మధ్యలో రెండుసార్లు (1996 వన్డే వరల్డ్‌కప్, 2014 టీ20 వరల్డ్‌కప్) జగజ్జేతగా నిలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు.. స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో కొంతకాలంగా అనామక జట్టుగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ జట్టు తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తుంది.
వన్డేల్లో వరుస విజయాలు..
టెస్ట్‌లను, టీ20లను పక్కన పెడితే ఆ జట్టు ఇటీవలికాలంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్–2023 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శుక్రవారం నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు వరుసగా ఏడు విజయాలు సాధించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌పై రెండో వన్డేతో మొదలైన ఆ జట్టు గెలుపు ప్రస్థానం.. నిరాటంకంగా సాగుతోంది.
వరల్డ్ కప్ బెర్త్ ఖాయం..
ఇక 2023 వన్డే ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది శ్రీలంక. వరస విజయాల్లో స్పిన్నర్ వనిందు హసరంగ, వెరటన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హపరంగ ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆతను 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్, ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా ఉన్నాయి.
గతమెంతో ఘనం..
శ్రీలంక గత క్రికెట్‌ను చూసుకుంటే 90వ దశకంలో జట్టులో ఉన్న బ్యాట్స్‌మెన్లు, అర్జున రణతుంగ జయసూర్య, డిసిల్వ, తిలకరత్నే, జయవర్దనే, బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ తదితరులు జట్టులో కీలకపాత్ర పోషించారు. ఒంటిచేత్తో జట్టును అనేక మ్యాచ్‌లలో గెలిపించారు. ముఖ్యంగా జయసూర్య ఓపెనర్‌గా అటాకింగ్ చూస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. క్రీజ్‌లో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లే కొట్టేవాడు. మిడిల్ ఆర్డర్‌లో జయవర్దనే, డిసిల్వా పటిష్టంగా ఆడేవారు. కెపెఎ్టన్‌గా అర్జున రణతుంగ జట్టును సమర్థవంతంగా నడిపించాడు. క్రమంగా వీరంతా రిటైర్మెంట్ అయ్యారు.
క్వాలిఫయర్స్‌లో టాప్..
క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ విషయానికొస్తే.. ఈ దశలో శ్రీలంక (6 పాయింట్లు) అని జట్ల కంటే టాప్‌లో ఉంది. జింబాబ్వే కూడా సమానమైన పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ శ్రీలంకతో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ దశలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ 3, 4 స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్ 0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, 2023 వరల్డ్‌కప్ రేసు నుంచి విడీస్ జట్టు దాదాపుగా నిష్క్రమించింది.