Kamindu Mendis : సరిగ్గా 24 గంటల క్రితం కామిందు మెండీస్ టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రంలోనే వరుసగా 8 మ్యాచ్ లలో 50+ కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దాన్ని మర్చిపోకముందే మరో ఘనతను సాధించాడు.. ఈసారి ఏకంగా బ్రాడ్ మన్ రికార్డును బ్రేక్ చేశాడు. శ్రీలంకలోని గాలే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా శతకం చేసిన కామిందు మెండీస్.. మరో రికార్డును సాధించాడు..కామిందు మెండీస్ వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు. 13 ఇన్నింగ్స్ లలో ఏకంగా ఐదు శతకాలు సాధించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ల పరంగా చూసుకుంటే అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా బ్రాడ్ మన్, జార్జ్ హెడ్లీ సరసన నిలిచాడు. వారు కూడా 13 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సాధించారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఎవర్టన్ వీక్స్ అనే ఆటగాడు ఉన్నాడు. అతడు ఏకంగా 10 ఇన్నింగ్స్ లలో 5 శతకాలు కొట్టాడు. అతడు తర్వాత హెర్బర్ట్, రాబర్ట్ హెవీ సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. వారిద్దరూ 12 ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు చేశారు.
ఆసియా ఖండంలో..
ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా ఈ రికార్డు సృష్టించిన ఆటగాడిగా కామిందు మెండీస్ నిలిచాడు. గతంలో ఈ ఘనత పాకిస్తాన్ ఆటగాడు ఫవాద్ అలామ్ పేరు మీద ఉండేది. ఫవాద్ 22 ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు కొట్టాడు. శ్రీలంక జట్టు తరఫున గతంలో అరవింద డిసిల్వా 38 ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు చేశాడు. ఇక ఈ ఘనత మాత్రమే కాకుండా కామిందు మెండీస్ మరో రికార్డు కూడా సృష్టించాడు. ఈ ఏడాది అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఆవిర్భవించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ (4) రికార్డును అవలీలగా బ్రేక్ చేశాడు. టెస్టులలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆసియా క్రికెటర్ గా కామిందు మెండీస్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్ లలో 900 కు పైగా పరుగులు చేసిన ఏడవ క్రికెటర్ గా కామిందు మెండీస్ సరికొత్త ఘనతను అందుకున్నాడు. అయితే ఆశ ఖండంలో ఈ ఘనతను సాధించిన రికార్డు గతంలో వినోద్ కాంబ్లీ (14 ఇన్నింగ్స్ లు) పేరు మీద ఉండేది. ఇక గత ఎనిమిది టెస్టులలో కామిందు మెండీస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై 61, బంగ్లాదేశ్ పై 102, 164, 92* పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుపై 113, 74, 64, రన్స్ చేశాడు. న్యూజిలాండ్ జట్టు పై 155*, 50+ పరుగులు చేశాడు. తద్వారా అనితర సాధ్యమైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు.
అద్భుతమైన టెక్నిక్
కామిందు మెండిస్ కు అద్భుతమైన టెక్నిక్ ఉంది. బౌలర్ ఎవరనేది కూడా చూడడు. మైదానం ఎలాంటిదైనా పరుగుల వరద పారిస్తాడు. ఎలాంటి బంతులు వేసినా భయపడడు. అందువల్లే అతడు సులువుగా పరుగులు చేయగలుగుతున్నాడు. తోటి ఆటగాళ్లు విఫలమైనచోట అతడు తనదైన మార్క్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. అందువల్లే శ్రీలంక జట్టు తురుపు ముక్కగా ఆవిర్భవించాడు.