Yashasvi Jaiswal Odi World Cup: భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో ఎవరు ఉండాలి అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఎప్పుడూ బలంగా ఉండే భారత జట్టును ఓడించడం ప్రత్యర్థులకు అంత సులభం కాదు. కాబట్టి ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లోను భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ వరల్డ్ కప్ నెగ్గాలంటే జట్టులో ఒక ప్లేయర్ తప్పకుండా ఉండాలి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు భారత మాజీ లెజెండ్ క్రికెటర్, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఆ యంగ్ క్రికెటర్ ఉంటే భారత్ విజయవకాశాలు మెరుగుపడతాయని గంగూలి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
టీమిండియా వరల్డ్ కప్ ఆకాంక్షను నెరవేర్చుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో 10 దేశాలు పాల్గొననున్నాయి. ఇప్పటికే మ్యాచ్లు నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ ఐదో తేదీన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 15, 16న రెండు సెమీఫైనల్స్ ముంబై, కోల్కతాలో నిర్వహించనుండగా, ఫైనల్ మ్యాచ్ ను నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్ విజయంలో కీలక ప్లేయర్ గా జైస్వాల్..
వరల్డ్ కప్ గెలవాలంటే ఏ జట్టులో అయినా ఒక ప్లేయర్ అద్వితీయమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. 2011 వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించిందంటే టోర్నీ ఆద్యంతం యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఆట తీరుతో గొప్ప విజయాలను అందించడం ద్వారా వరల్డ్ కప్ విజయం సాధించేందుకు దోహదపడ్డారు. ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించాలంటే కీలక ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉన్న యశస్వి జైస్వాల్ తప్పనిసరిగా జట్టులో ఉండాలి అంటూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి అభిప్రాయపడ్డాడు. ఈ వరల్డ్ కప్ లో జైస్వాల్ కచ్చితంగా ఓపెనర్ గా ఉండాలని ప్రతిపాదించాడు. టెస్టుల్లో తనకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యంగ్ బ్యాటర్ 171 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరును కొనసాగిస్తున్న జైస్వాల్ కు తప్పనిసరిగా వరల్డ్ కప్ జట్టులో అవకాశం కల్పించాలని ఆకాంక్షించాడు గంగూలి. అరంగేట్రంలోని జైస్వాల్ సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయమని, తాను కూడా తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై సెంచరీ కొట్టినట్లు గంగూలి చిన్నపిల్ల గుర్తు చేశాడు. టెక్నిక్ పరంగా చూసిన జైస్వాల్ బలంగా కనిపిస్తున్నాడని, జట్టులో లెఫ్ట్ హ్యాండ్ ఉండడం భారత జట్టుకు కలిసి వస్తుందన్న అభిప్రాయాన్ని గంగోలి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా జట్టులో ఆడించాలని సూచించాడు. ఇప్పటి వరకు వన్డేలో అరంగేట్రం చేయని జైస్వాల్ కు ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ లో మేనేజ్మెంట్ అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంత పెద్ద మెగా టోర్నీలో అవకాశం దక్కినా.. వయసులో బాగా చిన్నవాడైన జైస్వాల్ ఒత్తిడిని తట్టుకొని నిలబడతాడా లేదా అన్నది కూడా పలువురు అభిమానులను ప్రశ్నలు వేధిస్తున్నాయి.