https://oktelugu.com/

Mohammed Siraj: ఆటకు ఆట.. సంపాదనకు సంపాదన.. ఆటోవాలా నుంచి రేంజ్ రోవర్ వరకూ.. సిరాజ్ కొన్న కొత్త కారు ఇదే..

మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన బౌలర్ గా అవతరించాడు. వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటాడు. ఆ తర్వాత పలు సిరీస్లలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఫలితంగా అతడు జట్టులో స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 11, 2024 / 10:41 PM IST
    Follow us on

    Mohammed Siraj: అది ఓల్డ్ సిటీ.. అందులో ఓ వీధి. ఆ వీధిలో ఒక కుటుంబం నివాసం ఉంటున్నది. ఆ కుటుంబ పెద్ద ఆటో తోలుతూ తన కుటుంబాన్ని సాకేవాడు. అతడికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన కుటుంబ నేపథ్యం తెలియడంతో పెద్దపెద్ద కోచ్ ల వద్ద శిక్షణ పొందలేదు. చదువు అబ్బకపోవడంతో క్రికెట్ నే శ్వాసగా, ధ్యాసగా మార్చుకున్నాడు. అతడికి ప్రతి రోజు ఉదయం మైదానంలోనే తెల్లవారేది.. అలా ప్రతిరోజు క్రికెట్ లో నిరంతరం సాధన చేసేవాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే రంజి ప్లేయర్ అయ్యాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ఏస్ బౌలర్ గా రూపాంతరం చెందాడు. ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది ఈ ఉపోద్ఘాతం మొత్తం హైదరాబాదీ.. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ గురించి అని..

    మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన బౌలర్ గా అవతరించాడు. వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటాడు. ఆ తర్వాత పలు సిరీస్లలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఫలితంగా అతడు జట్టులో స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఆ సిరీస్లో భారత్ అద్భుతంగా రాణించింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ఈ విజయం సాధించిన నేపథ్యంలో భారత జట్టుపై కనక వర్షం కురిసింది. బీసీసీఐ ఏకంగా జాక్ పాట్ ప్రకటించడంతో.. టీమిండియా క్రికెటర్లకు తలా 5 కోట్లు వచ్చాయి. ఈ నగదుతో ఆటగాళ్లు భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మాత్రం కొత్త ల్యాండ్ రోవర్ కార్ కొనుగోలు చేశాడు. తన కుటుంబంతో కలిసి షో రూమ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. దీనికి డ్రీమ్ కార్ అని క్యాప్షన్ ఇచ్చాడు.

    “నాకు ల్యాండ్ రోవర్ కార్ అంటే చాలా ఇష్టం. దీనిని నా కుటుంబం కోసం కొనుగోలు చేశాను. మీరు కనే కలలకు ఏమాత్రం అవధి లేదు. అనితర సాధ్యమైన శ్రమతో వాటిని మీరు సాకారం చేసుకోవచ్చు. అప్పుడు మీరు పొందే ఆనందం మామూలుగా ఉండదు. ఎందుకంటే కష్టేఫలి” అని సిరాజ్ రాస్కొచ్చాడు. సిరాజ్ కారు కొనుగోలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..” నువ్వు కష్టపడ్డావు బ్రో. నీ ఆనందం ల్యాండ్ రోవర్ కారు లాగే ఉంది. నువ్వు ఇలాగే అభివృద్ధి చెందాలి. యువతకు స్ఫూర్తిగా నిలవాలి. నీ ఆట తీరు నీ వ్యక్తిత్వం ఆమోఘం. నీ బౌలింగ్ అనన్య సామాన్యం. నువ్వు పేద కుటుంబంలో పుట్టి ఇక్కడ దాకా వచ్చావు. నువ్వు చాలా మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచావని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.