Shubman Gill: టీమిండియా కు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో నాయకత్వం వహిస్తున్నాడు గిల్. పాతిక సంవత్సరాల వయసులో టీమిండియాకు నాయకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. అతడు సారధి కావడం వెనక గౌతమ్ గంభీర్ ప్రోత్సాహం కూడా ఉంది. వాస్తవానికి కెప్టెన్ అవ్వడం వెనక గౌతమ్ గంభీర్ కృషి విశేషంగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. గౌతమ్ గంభీర్ ను నమ్ముకుని ప్రయాణం సాగిస్తే పుట్టి మునగడం ఖాయమని కెప్టెన్ గిల్ కు అర్థమైనట్టు కనిపిస్తోంది. అందువల్లే కీలక నిర్ణయం తీసుకున్నాడు.
గిల్ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో.. చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వచ్చే ఏడాది జనవరి నెలలో న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత టి20 సిరీస్ కూడా ఆడుతుంది.. ఈ క్రమంలో గిల్ న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో టీమిండియాను అతడు నడిపించబోతున్నాడు. అయితే దీనికంటే ముందు విజయ్ హజారే ట్రోపీలో అతడు ఆడతాడు.
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. వీరిద్దరూ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడారు. అయితే ఇప్పుడు గిల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోతున్నాడు. అతడు కూడా రెండు మ్యాచ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో గిల్ కు చోటు లభించింది. అయితే ఈ టోర్నీలో పంజాబ్ జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. వాటికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు గాయ నుంచి కోలుకోలేదని.. న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో నేరుగా ఆడతాడని వార్తలు వచ్చాయి. అయితే గిల్ మాత్రం డొమెస్టిక్ వన్డే సిరీస్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
జనవరి 3న సిక్కిం , జనవరి 6న గోవాతో జరిగే మ్యాచ్లలో గిల్ ఆడుతాడు. ప్రస్తుతం గిల్ మొహాలీ ప్రాంతంలో ఉన్నాడు. జనవరి 1న జైపూర్ లో జరిగే మ్యాచ్ కు అతడు పంజాబ్ జట్టుతో కలుస్తాడు. అంతేకాదు ముంబై జట్టుతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ కూడా ఆడతాడు. అయితే జనవరి 8న పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్ ముంబై జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజుల తర్వాత న్యూజిలాండ్ జట్టుతో భారత ఆడే వన్డే సిరీస్ మొదలవుతుంది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ ను పురస్కరించుకొని భారత యాజమాన్యం క్రికెటర్ల కోసం ప్రాక్టీస్ క్యాంపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అధికారులు జరిగితే ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ కు గిల్ దూరంగా ఉంటాడు. గిల్ ప్రస్తుతం ఆశించినంత స్థాయిలో ఆటతీరు కొనసాగించడం లేదు. అందువల్లే అతడికి 2026 లో జరిగే టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. ప్రతిసారి గౌతమ్ గంభీర్ సపోర్ట్ తో ఇక్కడ దాకా వచ్చిన గిల్.. అతడినే నమ్ముకుంటే ఉపయోగం ఉండదని భావించి.. ఇప్పుడు విరాట్, రోహిత్ శర్మ వెళ్తున్న దారిలోకి వచ్చాడని నెటిజన్లు చెబుతున్నారు.