India vs England Shubman Gill : అసలు అతడిని టెస్ట్ జట్టుకు కెప్టెన్ ఎందుకు చేశారు? అతనికి ఎటువంటి అనుభవం లేదు కదా? పైగా ఇంగ్లీష్ జట్టు మీద అతడి రికార్డు అత్యంత దారుణం.. ఇటువంటి ఆటగాడిని సారధి ఎందుకు చేశారు?.. జట్టుకు సారధిగా ఎంపికైన తర్వాత గిల్ మీద మాజీ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు చేసిన ఆరోపణలు అవి.. ఈ లిస్టులో రవి శాస్త్రి కూడా ఉన్నాడు. అయితే తన మీద వచ్చిన ఆరోపణలకు.. విమర్శలకు గిల్ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.
ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పటికే అతడు తొలి టెస్ట్ లో సెంచరీ చేశాడు. రెండవ టెస్టులో.. అది కూడా టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన గిల్.. తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు సెంచరీ చేసిన అతడు.. రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగించాడు.. ముఖ్యంగా రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 200 కు పైగా పరుగులు జోడించాడు. తద్వారా కష్టాల నుంచి టీమిండియాను గట్టెక్కించాడు. ఇదే క్రమంలో 150 పరుగులు, ఆ తర్వాత డబుల్ సెంచరీ పూర్తి చేశాడు గిల్. 310 బంతులు ఎదుర్కున్న అతడు 21 బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు..
ఇంగ్లీషు జట్టుతో ప్రారంభమైన ఈ టెస్ట్ సిరీస్లో.. మొదటి మ్యాచ్లో అతడు సెంచరీ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే అతడు ఏకంగా శతకం బాది తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో అతడు విఫలమయ్యాడు. అది జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక రెండో టెస్టులో రెచ్చిపోయాడు. ముందుగా సమయోచితంగా అతని బ్యాటింగ్ చేశాడు. జట్టు 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో.. రవీంద్ర జడేజా తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. చాప కింద నీరు లాగా జట్టుకు స్కోరు అందించాడు. తద్వారా ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు. ఈ కార్యక్రమంలో నిదానంగా బ్యాటింగ్ చేస్తూ.. చెత్త బంతులను శిక్షిస్తూ.. మొత్తంగా గిల్ సరికొత్త టెస్ట్ క్రికెటర్ గా కనిపించాడు. 25 సంవత్సరాల వయసులో ఇంగ్లీష్ గడ్డమీద డబుల్ సెంచరీ చేసిన భారత జట్టు సారధిగా రికార్డు సృష్టించాడు.. గిల్ దూకుడు వల్ల భారత జట్టు ఈ కథనం రాసే సమయం వరకు 6 వికెట్ల నష్టానికి 470 పరుగులు చేసింది..గిల్ తో పాటు క్రీజ్ లో వాషింగ్టన్ సుందర ఉన్నాడు. గిల్, సుందర్ కలిసి ఏడో వికెట్ కు ఇప్పటివరకు 57 పరుగులు జోడించారు. కేవలం 77 బంతుల్లోనే వారు ఈ పరుగులు చేయడం విశేషం.. వాషింగ్టన్ సుందర్ 50 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 21 పరుగులు చేయడం విశేషం.
ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” నాకు గతంలో ఇంగ్లీష్ జట్టు మీద అంత గొప్ప రికార్డు లేదు. గత మ్యాచ్లలో నేను అంతగా రాణించలేదు. కానీ ఈసారి నా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుంది. కచ్చితంగా నా మీద ఉన్న అంచనాలను అందుకుంటాను. టెస్ట్ జట్టును ముందుండి నడిపిస్తాను. ఇంగ్లీష్ జట్టు మీద పై చేయి సాధిస్తాననే నమ్మకం ఉంది. అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలని భావిస్తున్నానని” గిల్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలు తగ్గట్టుగానే గిల్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అతడు సెంచరీ చేశాడు. రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు టీమిండియా కెప్టెన్ గిల్.