Shreyas Iyer Health: ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఇటీవలి వన్డే సిరీస్లో టీమిండియా ఆటగాడు, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పడుతుండగా అతడు కిందపడ్డాడు. ఈ క్రమంలో అతడి చేతికి, తలభాగానికి గాయాలైనట్టు అందరూ అనుకున్నారు. అయితే ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల ద్వారా అతడి పక్కటెముకలకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్రేయస్ అయ్యర్ చికిత్స పొందుతున్నాడు. దాదాపు మూడు రోజులపాటు అతడు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందినట్లు సమాచారం.
Also Read: రవితేజ, నవీన్ పోలిశెట్టి క్రేజీ మల్టీస్టార్రర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే
అయ్యర్ ఆరోగ్య పరిస్థితి పై రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అతడి హెల్త్ కండిషన్ గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ హేజిల్ వుడ్ ఒక కీలక విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయ్యర్ ను అతడు పరామర్శించాడు.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాడు. అంతేకాదు తన ఫోన్ ద్వారా అయ్యర్ చికిత్స పొందుతున్న తీరును ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు..” శ్రేయస్ అయ్యర్ ను నేను పరామర్శించాను. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందంటూ” హేజిల్ వుడ్ పేర్కొన్నాడు.
అయ్యర్ పక్కటెముకలకు గాయాలు మాత్రమే కాకుండా.. అంతర్గతంగా రక్తస్రావం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అందువల్లే అతడికి అత్యవసర వైద్య విభాగంలో ఆస్ట్రేలియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి ప్రస్తుతం కుదుటపడిందని.. ఇంకా ఆరోగ్యం మెరుగు కావాలంటే చాలా రోజులపాటు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే అతడు ఇప్పట్లో మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా వన్డే సిరీస్ ముగించుకున్న తర్వాత.. రేపటి నుంచి ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్ లో తలపడబోతోంది. ఈ సిరీస్ లో టీం ఇండియా ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టి 20 మ్యాచ్లు ఆడనుంది.
టీమిండియా కు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. ఎలాగైనా సరే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పై టీ20 సిరీస్ గెలవాలని భావిస్తోంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఇంతవరకు కూడా ఒక్క సిరీస్ కోల్పోలేదు. స్వదేశంలోనే కాదు.. విదేశంలో కూడా అద్భుతమైన రికార్డులను సృష్టించి ఆదరగొట్టింది. ఇక వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా టీం ఇండియా పై పై చేయి సాధించిన నేపథ్యంలో.. టి20 సిరీస్లో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే రెండు జట్లు బలాలపరంగా సమానంగా ఉండడంతో.. టి20 సిరీస్ హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.