కరోనా సమయంలోనూ క్రికెట్ ప్రియులను ఐపీఎల్-2020 అలరిస్తోంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఐపీఎల్-2020 అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మ్యాచులన్నీ ఉత్కంఠగా సాగుతుండటంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇక చైన్నె జట్టులో కొనసాగుతున్న సురేష్ రైనా.. హర్భజన్ సింగ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో వారిద్దరు మ్యాచులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే చైన్నె ప్రాంచైజీ వీరిద్దరు పేర్లను అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించింది. తాజాగా వారిద్దరు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే పనిలో పడింది.
2018 వేలం ప్రకారంగా సురేష్ రైనా.. హర్భజన్ సింగ్ లతో చెన్నై జట్టు మూడేళ్ల కాలానికి ఒప్పందాలను కుదుర్చుకుంది. సురేష్ రైనాకు ఏడాది 11కోట్లు.. భజ్జీకి 2కోట్లు ఇస్తున్నాయి. అయితే వీరిద్దరు ప్రస్తుత సీజన్లో పాల్గొన లేదు. వారి మూడేళ్ల కాంట్రాక్టు ముగియనుండటంతో వారితో బంధానికి విడ్కోలు పలికేందుకు చెన్నై జట్టు సన్నహాలు చేసుకుంటోంది.
ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి భజ్జి దూరంగా ఉండగా రైనా మాత్రం చెన్నై జట్టులో పాల్గొన్నాడు. పలు ప్రాక్టీస్ మ్యాచులకు హాజరయ్యాడు. అయితే వాటికి చెన్నై యాజమాన్యం డబ్బులు చెల్లించ లేదట. నిబంధనల ప్రకారం అసలైన మ్యాచులు ఆడితేనే ఆటగాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అతడికి డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా అతడితో ఉన్న ఒప్పందాలన్నింటికి రద్దు చేసుకునే పనిలో పడింది. భజ్జి పరిస్థితి కూడా ఇలానే ఉందట. దీంతో వీరిద్దరు వచ్చే ఐపీఎల్ సీజన్లోనైనా ఆడతారో లేదో వేచి చూడాల్సిందే..!