SRH Vs MI 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ముంబై పై ఏకంగా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.. అనంతరం చేజింగ్ కు దిగిన ముంబై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ కూర్పు బాగోలేదని సీనియర్ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
ముంబై జట్టు బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడిని హార్దిక్ పాండ్యా సరిగా ఉపయోగించుకోలేదు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమైతే..బుమ్రా ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం మరో తప్పిదం.. బుమ్రా తో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేయించిన హార్దిక్ పాండ్యా.. 13 ఓవర్ వరకు బుమ్రా కు బౌలింగ్ ఇవ్వలేదు. ఈ తొమ్మిది ఓవర్ల మధ్యలో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు విధ్వంసాన్ని సృష్టించారు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదిలిపెట్టకుండా చితకబాదారు..
అప్పటికి హైదరాబాద్ స్కోరు అసాధారణంగా పెరగడంతో గత్యంతరం లేక పాండ్యా 13వ ఓవర్ ను వేసే బాధ్యత బుమ్రా కు అప్పగించాడు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. పవర్ ప్లే లో హైదరాబాద్ జట్టు 81 పరుగులు సాధించింది. 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.. 13 ఓవర్ బుమ్రా వేసే సమయానికి హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. “ఆట పూర్తిగా ముంబై చేతిలో నుంచి వెళ్లిపోయిన తర్వాత బుమ్రా కు బౌలింగ్ ఇచ్చారు. ఇది సరైన నిర్ణయం కాదు. ఇప్పటికైనా దీని గురించి పాండ్యా సమీక్షించుకోవాలని” భారత మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్, న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్ క్లె నాగన్ అభిప్రాయపడ్డారు.
బుమ్రా తన రెండో స్పెల్ కు వచ్చే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో హెడ్, అభిషేక్ శర్మ చేయాల్సిన నష్టం చేశారు. అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హెడ్ 18 బంతుల్లో ఆ ఘనత పూర్తి చేశాడు.. వీరిద్దరు బలమైన ఇన్నింగ్స్ నిర్మించారు. చివర్లో క్లాసెన్ ఇన్నింగ్స్ తోడు కావడంతో హైదరాబాద్ స్కోర్ మెరుపు వేగంతో దూసుకెళ్లింది. ఒకవేళ బుమ్రా కు ముందు బౌలింగ్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. “హెడ్, అభిషేక్ శర్మ ఆ స్థాయిలో ఆడుతున్నప్పుడు పాండ్య ఆలోచించాల్సి ఉండాల్సింది. వారిని కట్టడి చేయాలంటే బుమ్రా ను బరిలోకి దించి ఉంటే ఆట మరో తీరుగా ఉండేది. కానీ ముంబై జట్టు సరైన ప్రణాళిక చేయలేదు. హార్దిక్ పాండ్యా తన అవివేకాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడని” మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు..” వారు పవర్ ప్లే లో అత్యుత్తమంగా బౌలింగ్ చేయించలేదు. అది మా దూకుడుకు ఉపయోగపడింది. ఇంతటి స్కోర్ దానివల్లే సాధ్యపడిందని” క్లాసెన్ అన్నాడు. ఆరెంజ్ క్యాప్ స్వీకరిస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.