Satwiksairaj – Chirag Shetty : భారత్ బ్యాట్మెంటన్ చరిత్ర సరికొత్త సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతోంది. యువ షట్లర్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రపంచ టూర్ 1000 టోర్నీ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్లుగా ఇండియన్ బ్యాట్మెంటన్ హిస్టరీలో రికార్డ్ సృష్టించారు. ఇది కేవలం వీరి ఒక్క విజయమే కాదు రాబోయే ప్రతి యువ బ్యాట్మెంటన్ ప్లేయర్ కు స్ఫూర్తిదాయకం.
ఇప్పటివరకు సింగిల్స్ లో తమ సత్తాను నిరూపిస్తూ వచ్చిన మన యువ షట్లర్లు డబుల్స్ లో కూడా తమ స్టైల్ రికార్డ్ సృష్టించారు. సింగిల్స్ లో పాల్గొన్న భారత్ స్టార్ ప్లేయర్లు అందరూ వెనుదిరిగిన సమయంలో… మేమున్నామని ఎంతో దృఢంగా నిలబడి ఈ జోడి డబుల్స్ లో అదరగొట్టింది. ఒకపక్క చిరాగ్ తన పదునైన నెట్ గేమ్ తో రెచ్చిపోతే మరోపక్క సాత్విక్ సూపర్ స్మాష్‌లతో అపోనెంట్స్ కి వణుకు పుట్టించాడు.
ఇంతకుముందు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కూడా ఈ జంట స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. 43 నిమిషాల నిడివిలో ముగిసిన ఈ పోటీలో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్స్ తో మ్యాచ్‌ను మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ముగించారు. అంతేకాకుండా ఇప్పటివరకు పురుషుల డబుల్స్ లో భారతదేశం తరఫున ఆరు ప్రపంచ టూర్ టైటిల్స్ కైవసం చేసుకున్న తొలి జోడి వీరిద్దరిదే. ఈ సందర్భంగా వీరిద్దరిని స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అభినందించారు. వీరి విజయం యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ జోడి భారత్‌కు ఒలంపిక్ పథకాన్ని తప్పక సాధిస్తుంది అని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చిరాగ్ మరియు సాత్విక్ ,ప్రస్తుతం అందరి నోటి వెంట ప్రశంసలు అందుకుంటున్న ఈ ఇద్దరు…సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేసి విజయం అందుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను దాటి వచ్చారు. కేవలం వాళ్ళ విజయం గురించే మాట్లాడుకునే అందరూ ఆ బాటలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ప్రస్తావించడం మర్చిపోతున్నారు. ముంబై కి చెందిన చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి అతి చిన్న వయసులో బ్యాట్మెంటన్ ఫీల్డ్ లో అడుగు పెట్టాడు. అతని కుటుంబం నుంచి ఎవ్వరూ ఇప్పటివరకు ఆ ఆట ఆడింది లేదు.. పైగా జనానికి క్రికెట్ మీద ఉన్న పిచ్చి మిగిలిన ఆటల మీద ఉండదు.
ఎంతో అండర్టేటెడ్ గా పరిగణించినప్పటికీ ఏడేళ్ల వయసు నుంచి అతను బ్యాట్మెంటన్ పైనే మక్కువ చూపాడు. 16 సంవత్సరాల వరకు ఈ ఆటను అతను పెద్ద సీరియస్గా తీసుకుంది లేదు. కానీ ఎప్పుడైతే ఈ క్రీడను తన కెరియర్ గా మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అప్పటినుంచి అహర్నిశలు సక్సెస్ కోసం శ్రమించాడు.
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం జిల్లాకు చెందిన క్రీడాకారుడు. ఆరు సంవత్సరాల వయసులో బ్యాట్మెంటన్ పై ఇంట్రెస్ట్ చూపించిన సాత్విక్ తన తండ్రి దగ్గర ప్రాథమిక శిక్షణ పొందాడు. సాత్విక్ తండ్రి కాశీ విశ్వనాథ్ మాజీ రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కావడంతోపాటు ఒక రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. బ్యాట్మెంటన్ లో తన కొడుకు ప్రతిభను చూసి 2014లో ఆయన సాత్విక్ ను గోపీచంద్ బ్యాట్మెంటన్ అకాడమీ లో జాయిన్ చేశారు.
ఈరోజు అందరూ చూస్తున్న వీరి సక్సెస్ వెనక కేవలం వారి కష్టమే కాదు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ లు మరియు తల్లిదండ్రుల తపన ఎంతో ఉంది. అన్నిటికీ మించి దేశం కోసం పోరాడాలి అన్న క్రీడా స్ఫూర్తి ఇద్దరిలో మెండుగా ఉంది. అందుకే నిలకడగా ఆడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ బ్యాట్మెంటన్ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నారు ఈ ఇద్దరు యువ క్రీడాకారులు.