RR Vs KKR: నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఐపిఎల్ 17వ సీజన్లో మంగళవారం మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. కోల్ కతా వేదికగా కోల్ కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడి.. ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా జట్టు ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలతో రెండవ స్థానంలో ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా ఈ రెండు జట్లు బలంగా ఉన్నాయి. లో స్కోర్ ను కాపాడుకోవడంలో ఈ రెండు జట్ల ఆటగాళ్లు సిద్ధహస్తులు. అందువల్లే ప్రత్యర్థి జట్లపై ఈ రెండు జట్ల ఆటగాళ్లు అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. ఈ మ్యాచ్లో కోల్ కతా పై విజయం సాధించి నెంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని రాజస్థాన్ భావిస్తుంటే.. రాజస్థాన్ పై గెలుపొంది నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవాలని కోల్ కతా భావిస్తోంది. హోరాహోరీగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్న ఈ మ్యాచ్లో రెండు జట్ల బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే..
కోల్ కతా
ఈ జట్టు ఇప్పటివరకు అత్యుత్తమ కంబైన్డ్ ఎకానమీ రేటు (8.33) కొనసాగిస్తోంది.. ఈ జట్టులో సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా అతడు మారాడు. ఇటీవలి రెండు మ్యాచ్లలో సునీల్ నరైన్ 4.50 ఎకనామి రేటుతో బౌలింగ్ చేశాడంటే అతడు ఏ విధంగా బంతులు సంధిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇతడి బౌలింగ్లో బ్యాటర్లు బౌండరీ కొట్టడానికి కూడా భయపడుతున్నారు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి కూడా మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. హర్షిత్ రానా, మిచెల్ స్టార్క్ వంటివారు ధారాళంగా పరుగులు ఇస్తుండడం కోల్ కతా జట్టును ఇబ్బందికి గురిచేస్తున్నది. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రానా ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో చేతన్ సకారియా కు అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఇక బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ అయ్యర్ , సాల్ట్, సునీల్ నరైన్ తో కోల్ కతా బలంగా కనిపిస్తోంది. అయ్యర్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి 129 రన్స్ చేశాడు. సాల్ట్ 191, నరైన్ 161 రన్స్ చేసి సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే బ్యాటింగ్ విభాగం పూర్తిగా వీరి ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. మిగతా ఆటగాళ్లు కూడా మెరుగ్గా ఆడాలని జట్టు కోరుకుంటున్నది.
రాజస్థాన్
రాజస్థాన్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చాహల్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు 11 వికెట్లు పడగొట్టా. పర్పుల్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ప్రతి 12 బంతులకు చాహల్ ఒక వికెట్ పడగొట్టాడు. అత్యుత్తమ స్ట్రైక్ రేటు కొనసాగిస్తున్నాడు. మరో మూడు వికెట్లు పడగొడితే అతడు టి20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ట్రెంట్ బౌల్ట్ 6 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం వీరిద్దరి మీదే ఆధారపడి ఉంది. మిగతా బౌలర్లు రాణించాలని ఆ జట్టు కోరుకుంటున్నది.
అటు కోల్ కతా, ఇటు రాజస్థాన్ వరుస విజయాలతో జోరు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జరిగే మ్యాచ్ హై వోల్టేజ్ గా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో కోల్ కతా గెలిచేందుకు 58% అవకాశం ఉందని.. రాజస్థాన్ గెలిచేందుకు 42 శాతం అవకాశం ఉందని తెలుస్తోంది.
కోల్ కతా
సాల్ట్, సునీల్ నరైన్, రఘు వన్షీ/ నితిన్ రాణా, అయ్యర్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ దీప్ సింగ్, స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
రాజస్థాన్
బట్లర్, అశ్విన్, యశస్వి జైస్వాల్, సంజు సాంసన్(కెప్టెన్), పరాగ్, హిట్మేయర్, ధృవ్ జురెల్, కేశవ మహారాజ్, పావెల్, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కులదీప్ సేన్, యజువేంద్ర చాహల్.