Ross Taylor Rahul dravid : భారత్ లో క్రికెట్ అంటే ఒక మతం.. ఆ మతాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. విదేశీ క్రికెటర్లు అయితే భారత్ లో ఇంత పిచ్చిగా ప్రేమించే క్రికెట్ అభిమానులను ఎప్పుడూ చూసి ఉండమని చెబుతుంటారు. న్యూజిలాండ్ ప్రముఖ లెజండరీ క్రికెటర్ రాస్ టేలర్ సైతం భారత్ లోని క్రికెట్ పిచ్చిని చూసి అందరూ షాక్ అయ్యారు.

తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’ ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్ శనివారం ఐపీఎల్ సందర్భంగా డకౌట్ అయినందుకు రాయల్స్ రాజస్థాన్ ఓనర్ తన చెంప పగుల కొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు.
ఇక తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్.. ప్రస్తుత హెడ్ కోచ్ ద్రవిడ్ తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ పంచుకున్న టేలర్ అప్పుడు బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నారు.
2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రావిడ్ తో కలిసి రాజస్థాన్ లోని రణతంబోర్ జాతీయ పార్క్ ను సందర్శించాడు. 21 సార్లు వెళ్లినా కనిపించని పులి.. 22వ సారి ద్రావిడ్ కు కనిపించడంతో రాహుల్ ద్రావిడ్ ఆనందం వ్యక్తం చేశారని.. అయితే పులిని చూడడానికి వచ్చిన జనాలు అది వదిలేసి.. ద్రావిడ్ ను చూశారని టేలర్ చెప్పుకొచ్చాడు. పులిని చూసిన ఆనందం కంటే వారు రాహుల్ ద్రావిడ్ ను చూసిన ఆనందమే ఎక్కువగా అనిపించిందన్నారు. తనకు తెలిసినంత వరకూ ప్రపంచంలో 4వేల పులులు ఉంటాయేమో కానీ.. రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడేనని.. అందుకే ఆయన పట్ల ఇంత క్రేజ్ అని రాస్ టేలర్ అన్నారు.
ఇలా ద్రావిడ్ గొప్పతనం.. ఇండియాలో క్రికెట్ పై ఉన్న ప్రేమను తన పుస్తకంలో టేలర్ గొప్పగా వర్ణించాడు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.