Rohit-Sharma-IPL
Rohit Sharma : రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డక్ ఔట్ అయిన రోహిత్ శర్మ.. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తన పూర్వపు లయను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 27 బంతుల్లో 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్థ సెంచరీని కోల్పోయినప్పటికీ మైదానంలో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రోహిత్ చేసిన 49 పరుగుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ బ్యాటింగ్ ధాటికి ముంబై జట్టు పవర్ ప్లే లో ఏకంగా 75 రన్స్ చేసింది.
ఒక్క పరుగు తేడాతో అర్థ సెంచరీ కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ ఢిల్లీ పై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం నాటి మ్యాచ్ లో 49 పరుగులు చేయడం ద్వారా ఢిల్లీపై 1000 పరుగుల మైలురాయి అందుకున్న ఆటగాడిగా ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు సాధించిన మూడవ ఆటగాడిగా రోహిత్ శర్మ వినతికెక్కాడు. ఢిల్లీ కంటే ముందు కోల్ కతా జట్టు పై రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ రికార్డును ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్, బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సాధించారు. డేవిడ్ వార్నర్ పంజాబ్, కోల్ కతా జట్లపై వెయ్యి పరుగుల మైలురాయి అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై 1000+రన్స్ సాధించాడు. కాగా, ఢిల్లీ జట్టుతో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీకి దగ్గరైన రోహిత్ శర్మను అక్షర్ పటేల్ అద్భుతమైన బంతి వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు.
రోహిత్ శర్మ మైదానంలో ఉన్నంతసేపు దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. ఆదివారం నాటి మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లను వణికించాడు. ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ కాకుండా ఉండి ఉంటే మరింత వేగంగా ఆడేవాడు. వరుస ఓటముల నేపథ్యంలో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పైనే కాకుండా.. రోహిత్ శర్మ పై కూడా ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆ ఒత్తిడిని అధిగమించలేక రోహిత్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ ఆదివారం నాటి మ్యాచ్ లో ఆ పరిస్థితి పునరావృతం కానివ్వలేదు. మరో ఓపెనర్ కిషన్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వికెట్ కు కిషన్ తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.