
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. నిజానికి కోహ్లీకి టెస్టు బాధ్యతలు మిగిల్చి.. టీ20, వన్డే పగ్గాలు రోహిత్ కు అప్పగించాలనే డిమాండ్ కొంత కాలంగా వినిపిస్తోంది. వారం నుంచి ఈ డిమాండ్ తీవ్రం కావడంతో.. ఏకంగా బీసీసీఐ స్పందించింది. అలాంటిది ఏమీ లేదని, కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడని ప్రకటించింది. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు కోహ్లీ.
త్వరలో జరగబోయే టీ20వరల్డ్ కప్ మెగా ఈవెంట్ తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడు. దీంతో.. కోహ్లీ తర్వాత భారత జట్టుకు నాయకత్వం వహించేది ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయమై ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్(Gavaskar) కేెఎల్ రాహుల్(KL Rahul) కు కెప్టెన్సీ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే.. మెజారిటీ క్రీడాభిమానులు మాత్రం రోహిత్ శర్మ(Rohit Sharma)ను కెప్టెన్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
దీనికి కారణం ఉంది. టీ20 ఫార్మాట్ లో రోహిత్ కు మంచి రికార్డు ఉంది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ టోర్నీలో ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ఒకసారి కాదు ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గాడు. 2013లో మొదలైన అతని ట్రోపీ వేట అప్రతిహతంగా సాగుతూనే ఉంది. 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిల్ నెగ్గాడు రోహిత్. అంతేకాకుండా.. కెప్టెన్ గైర్హాజరీలో పలుమార్లు టీమిండియా కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పైగా.. సీనియర్. మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇన్ని కారణాలతో రోహిత్ కే పట్టం కట్టాలనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
అయితే.. రోహిత్ కెప్టెన్ కాకుండా అడ్డుకునే నెగెటివ్ అంశం కూడా ఒకటి ఉంది. అంతేకాదు.. అది చాలా బలమైనది కూడా. అది మరేదో కాదు.. రోహిత్ వయసు. అవును.. ఇప్పుడు రోహిత్ వయసు 34 సంవత్సరాలు. అంటే.. మరో మూడ్నాలుగు సంవత్సరాలకు రిటైర్ అయ్యే ఏజ్. ఇలాంటి ఆటగాడికి కెప్టెన్సీ కట్టబెట్టడానికి బీసీసీఐ ఆలోచించే అవకాశం ఉంది.
రోహిత్ మూడు నాలుగేళ్లలో రిటైర్ అయిపోతే.. మళ్లీ కొత్త కెప్టెన్ ఎంచుకోవడం అనేది మరో సమస్య. అందుకే.. ఇప్పుడే యువ ఆటగాడికి పగ్గాలిస్తే.. త్వరలో రాటుదేలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి.. బీసీసీఐ ఇదే కోవలో ఆలోచించే అవకాశం ఉందనే వారు కూడా ఉన్నారు. గవాస్కర్ రోహిత్ ను సూచించకపోవడానికి కారణం ఇదేనని కూడా అంటున్నారు. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుంది? బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది చూడాలి.