Rohit Sharma: లావుగా ఉంటాడు.. వికెట్ల మధ్య పరుగులు తీయలేడు. ఫీల్డింగ్ వేగంగా చేయలేడు.. రోహిత్ శర్మ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఇవి. అందువల్లే అతడిని టెస్ట్ నుంచి.. వన్డే నుంచి సారధిగా తొలగించినట్టు వార్తలు వచ్చాయి. అతడిని పక్కన పెట్టడం వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మను పక్కన పెట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ ఏరి కోరి గిల్ కు అవకాశం ఇచ్చాడు. అతడు కూడా అంతంత మాత్రమే ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత.. జట్టుపై మాత్రమే కాదు.. కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది.
రెండు టెస్టుల ఓటమి తర్వాత టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా జట్టుతో ఈ నెల 30 నుంచి 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ రాంచి వేదికగా ప్రారంభమవుతుంది.. ఈ మ్యాచ్లో తన సత్తా చూపించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అవుతున్నాడు. మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల రోహిత్ నాయర్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అదే కాదు తన ఫుడ్ మెనూ కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు.. మైదానంలో తీవ్రంగా కసరత్తు చేయడం ద్వారా సన్నగా మారిపోయాడు.. అందువల్లే ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్ లో వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. ఒక ఆఫ్ సెంచరీ, మరొక సెంచరీ సహాయంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
రాంచీలో జరిగే వన్డే కోసం రోహిత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో హిట్ మాన్ సరికొత్తగా కనిపించాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ మరింత సన్నగా మారిపోయాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వన్డేలలో వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా రోహిత్ తన శరీర సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు. 37 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ.. కుర్రాడి మాదిరిగా కనిపిస్తున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు. రోహిత్ శరీర సామర్థ్యాన్ని చూస్తే 2013 సంవత్సర కాలంలో ఉన్నట్టుగా ఉన్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. లావుగా ఉన్నాడని కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగించారని.. ఇప్పుడు అతని లుక్ చూసి గౌతమ్ గంభీర్ ఏమవుతాడోనని అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
రోహిత్ ఇటీవల ఇంటర్వ్యూలో తన శరీర సామర్థ్యం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఫుడ్ మెనూ పూర్తిగా మార్చుకున్నానని వ్యాఖ్యానించాడు. అధిక బరువును తొలగించుకోవడం ద్వారా శరీరం తేలికైందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో కూడా సరికొత్తగా ప్రాక్టీస్ మొదలు పెట్టానని రోహిత్ వివరించాడు.