Ayush Mhatre: అదేం కొట్టుడు.. అదేం దూకుడు.. బంతి మీద కోపం ఉన్నట్టు.. బౌలర్ మీద కసి ఉన్నట్టు.. ఏమాత్రం భయం అనేది లేనట్టు.. బౌండరీ మీటర్ చిన్నబోయినట్టు.. సిక్సర్ కొట్టడం సులభమైనట్టు.. బీభత్సంగా కొట్టాడు. ఊర మాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పనిలో పనిగా టీమిండియా లెజెండరీ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన ఆ యువకుడి పేరు ఆయుష్ మాత్రే. ఈ యువకుడి వయసు 18 సంవత్సరాల 135 రోజులు. వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్లో మూడు ఫార్మాట్ లలో (ఫస్ట్ క్లాస్, లిస్టు ఎ, టి20) శతకం సాధించిన యువ ఆటగాడిగా ఆయుష్ రికార్డును కొలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విదర్భ జట్టుపై 53 బంతుల్లో 110 పరుగులు చేశాడు. తద్వారా రోహిత్ రికార్డును బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్లో మూడు ఫార్మాట్ లలో 19 సంవత్సరాల 339 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. అతడి రికార్డును ఆయుష్ బద్దలు కొట్టాడు. రోహిత్ తర్వాత స్థానంలో ఉన్మకత్ చంద్ (20 సంవత్సరాలు), డికాక్ (20 సంవత్సరాల 62 రోజులు), అహ్మద్ (20 సంవత్సరాల 97 రోజుల వయసు) సెంచరీలు సాధించారు. ఆయుష్ ఫుట్ వర్క్ అద్భుతంగా ఉంది. వేగంగా పరుగులు చేయడంలో నేర్పరితనం కనిపిస్తోంది. అందువల్లే అతడిని భవిష్యత్తు టీమ్ ఇండియా సారధిగా అభిమానులు భావిస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా అతడికి విరివిగా అవకాశాలు ఇస్తుంది.
ఆయుష్ డొమెస్టిక్ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. జాతీయ జట్టులో అవకాశం లభిస్తే సరికొత్త ఆశా కిరణం లాగా ఆవిర్భవిస్తాడని ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే ఆయుష్ టన్నులకొద్ది పరుగులు చేస్తున్నాడు. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.. అందువల్లే అతడు భవిష్యత్తు లో టీమ్ ఇండియాకు సారధ్యం వహిస్తాడని అభిమానులు పేర్కొంటున్నారు.