Rohit And Kohli Retirement: టెస్ట్ ఫార్మాట్ లోనూ పరుగుల వరద పారించి సరికొత్త రికార్డులు సృష్టించారు. అయితే ఎంతో ఘనత ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికారు. వాస్తవానికి వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకోవడం సగటు క్రికెట్ అభిమానిని షాక్ కు గురిచేసింది. ఎందుకంటే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి రెండుసార్లు వెళ్లినప్పటికీ.. ఛాంపియన్ మాత్రం కాలేక పోయింది. టీమిండియాకు ఆ వెలితి తీరాలంటే గొప్పగా ఆడాలి. టీమిండియా గొప్పగా ఆడాలంటే అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ ఉండాలి. వీరిద్దరూ గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోయినప్పటికీ.. జట్టులో ఉంటే చాలు.. కావాల్సినంత ధైర్యం లభిస్తుంది.. మిగతా ఆటగాళ్లకు కాస్త భరోసా లభిస్తుంది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు కేవలం రోజుల వ్యవధిలోనే టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడం సంచలనం కలిగిస్తోంది. వాస్తవానికి వారిద్దరు ఈ నిర్ణయం తీసుకుంటారని.. ఇలాంటి పరిస్థితిని టీమిండియాగా తీసుకొస్తారని ఏ ఆటగాడు ఊహించలేదు. అభిమానులు కూడా అంచనా వేయలేదు. రోహిత్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం నుంచి ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ కోలుకోలేదు. దాని మర్చిపోకముందే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
అందుకే విడిపోయారా
టీమిండియాలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని తలపోస్తోంది. ఇందులో భాగంగానే గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించి.. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ను నియమించాలని అనుకుంటున్నది. ఇదే విషయాన్ని ఇటీవల రోహిత్ శర్మతో చెబితే.. అతడు తన నిర్ణయాన్ని వెంటనే వెల్లడించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో తనను టెస్ట్ జట్టుకు సారధిగా నియమించాలని బీసీసీఐ పెద్దల ముందు విరాట్ కోహ్లీ ప్రతిపాదన ఉంచాడు. దానికి వారు నో చెప్పారు. దీంతో విరాట్ కోహ్లీ కొంచెం సమయం తీసుకొని సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. మొత్తంగా కెప్టెన్సీని అడిగినందుకు ఇవ్వని మేనేజ్మెంట్ పై అతడు పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు..
జట్టు ప్రయోజనాల కంటే ఎక్కువ కాదు కదా
ఆటగాళ్లు ఎంతటి గొప్ప వాళ్ళయినా సరే జట్టు ముందు తక్కువే. కానీ ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విస్మరించినట్టు కనిపిస్తున్నారు. గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడిన వీరిద్దరూ.. గొప్ప పేరున్న వీరిద్దరూ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ సరిగా ఆటం లేదు. దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తూ పరువు తీసుకుంటున్నారు. ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్లో.. ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో అత్యంత దారుణంగా విఫలమయ్యారు. కనీసం విరాట్ కోహ్లీ చెప్పుకోవడానికైనా ఒక సెంచరీ ఉంది.. రోహిత్ శర్మకు ఆ మాత్రం కూడా లేదు. పైగా ఆఫ్ సైడ్ బంతులను పదేపదే వేటాడి ఇద్దరు మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కెప్టెన్సీ విషయంలోనే ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు ఆగ్రహాన్ని కూడా కలిగిస్తోంది. ఎంతో గొప్ప పేరు ఉన్న ఆటగాళ్లు ఇలా చేయడం ఏంటని సగటు భారత జట్టు క్రికెట్ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. జట్టు ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలకే పెద్ద పీటవేయడం ఎంతవరకు సమంజసమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.