RCB Yash Dayal Trouble: ఇటీవలి ఐపిఎల్ లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పేస్ బౌలర్ యష్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. గత కొంతకాలంగా అంతగా ఆకట్టుకోలేని అతడు ఐపీఎల్లో మాత్రం అదరగొట్టాడు. బెంగళూరు జట్టు తరఫున కీలకమైన మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అందువల్లే అతడు కీలక ఆటగాడిగా అవతరించాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే యష్ దయాళ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యేవాడే. కానీ ఒక యువతి చేసిన ఫిర్యాదు యష్ క్రీడా జీవితాన్ని తలకిందులు చేసింది. ఎందుకంటే ఆ యువతి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం ఈ కేసులో యష్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. ఇది ఇలా ఉండగానే.. అతడు యూపీ టి20 లీగ్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
Also Read: ఆమెతో డేటింగ్.. ఆ ఒక్క ఫోటోతో క్లారిటీ చేసిన సిరాజ్!
ఒక యువతి చేసిన ఆరోపణలు మాత్రమే కాకుండా.. మరో మైనర్ పై లైంగిక దాడి చేశాడని ఫోక్సో కేసు నమోదయింది. దీంతో అతని క్రీడా జీవితంపై నీలి నీడలో కమ్ముకున్నాయి. మరోవైపు యష్ కు విధించిన నిషేధంపై తమకు ఎటువంటి సమాచారం లేదని గోరఖ్ పూర్ లయన్స్ ఫ్రాంచైజీ జట్టు ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఐపీఎల్ లో యష్ ను బెంగళూరు జట్టు యాజమాన్యం అంటి పెట్టుకుంటుందా.. బయటికి వదిలేస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. వాస్తవానికి ఒక ఆటగాడి మీద ఏవైనా ఆరోపణలు వస్తే..క్లీన్ చీట్ లభించిన తర్వాతే ఏ యాజమాన్యమైనా అతడికి ఆడే అవకాశం ఇస్తుంది. ఈ ఆరోపణల నుంచి యష్ బయటపడితేనే బెంగళూరు యాజమాన్యం అతడిని జట్టులో కొనసాగిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.