Ravindra Jadeja: ఈ ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న కీలక ఆటగాడు రవీంద్ర జడేజా.. ఇంతవరకు తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేదు. దీంతో అతడి అభిమానులు ఉసూరు మంటున్నారు.. ఇదేం ఆట తీరంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఆ విమర్శలకు తన ఆటతీరుతో రవీంద్ర జడేజా సమాధానం చెప్పాడు. సోమవారం రాత్రి చెన్నై వేదికగా కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ వేసి తన పూర్వపు లయను అందుకున్నాడు. అంతేకాదు తనదైన రోజు ఏదైనా చేయగలనని నిరూపించాడు. మెలి తిరిగిన బంతులు వేస్తూ కొరకరాని కొయ్య ల్లాంటి కోల్ కతా ఆటగాళ్ళను బోల్తా కొట్టించాడు. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కూడా అందుకున్నాడు.
టాప్ ఆర్డర్ ను పడగొట్టారు
కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. చెన్నై వేదికగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. ఒకరి వెంట ఒకరు వరుసగా పెవిలియన్ చేరుకున్నారు.. దీంతో ఆ జట్టు కేవలం 137 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేయగలిగింది. కోల్ కతా కెప్టెన్ అయ్యర్ చేసిన 34 పరుగులే ఆ జట్టులో హైయెస్ట్ స్కోర్ అంటే వారి బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సీజన్లో మెరుపులు మెరిపిస్తున్న సాల్ట్ గోల్డెన్ డక్ గా అవుటయ్యాడు. నరైన్ 27, రఘు వన్షీ 24, వెంకటేష్ అయ్యర్ 3, రమన్ దీప్ సింగ్ 13, రింకు సింగ్ 9, రస్సెల్ 10, అనుకూల్ రాయ్ 3, స్టార్క్ 0, వైభవ్ అరోరా 1 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు సాధించాడు. అతనితోపాటు దేశ్ పాండే మూడు వికెట్లు సాధించాడు. ముస్తాఫిజుర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తీక్షణ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కోల్ కతా టాప్ ఆర్డర్ ను రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ కూల్చేశారు. వీరికి తీక్షణ తోడు కావడంతో కోల్ కతా ఆటగాళ్లు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు.
అరుదైన ఘనత
ఇక ఈ మ్యాచ్ లో జడేజా బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ అదరగొట్టాడు. కోల్ కతా ఇన్నింగ్స్ లో తొలి బంతిని సాల్ట్ గాల్లోకి లేపగా.. దానిని జడేజా అమాంతం అందుకున్నాడు. ఇది ఐపీఎల్ లో అతడికి 99వ క్యాచ్. అనంతరం ముస్తాఫిజుర్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా.. అయ్యర్ క్యాచ్ ను అమాంతం పట్టుకున్నాడు. ఈ క్యాచ్ తో జడేజా అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్ లో 100 క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (98) ను అధిగమించాడు. 100 క్యాచ్ లతో హిట్ మాన్ రోహిత్ శర్మ (100) సరసన నిలిచాడు. 110 క్యాచ్ లతో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 109 క్యాచ్ లతో సురేష్ రైనా రెండవ స్థానం, 103 క్యాచ్ లతో పొలార్డ్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.