Ravichandran Ashwin DRS: క్రికెట్ లో తప్పిదాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశంతో డిఆర్ఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానంలో ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చే నిర్ణయంపై ఇటు బౌలర్లకు గాని, అటు బ్యాటర్లకు గాని అనుమానం ఉంటే డిఆర్ఎస్ కోరుకుని.. ఆ నిర్ణయాన్ని సమీక్షించుకునే అవకాశం ఉంది. దీనివల్ల అనేకసార్లు అనేక జట్ల ఆటగాళ్లు లబ్ది పొందారు. డిఆర్ఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒకే బంతికి రెండు డిఆర్ఎస్ లు తీసుకున్న ఘటన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో చోటుచేసుకుంది. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డిఆర్ఎస్)ను క్రికెట్ లో నాణ్యతా ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో తీసుకువచ్చారు. ఈ విధానం బౌలర్లకు, బ్యాటర్లకు కూడా అనేక సందర్భాల్లో మేలు కలిగిస్తోంది. సాధారణంగా దీనిని ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చే నిర్ణయానికి వ్యతిరేకంగా కోరుతుంటారు. ఒక బంతికి ఒకసారి డిఆర్ఎస్ కోరుకోవడం ఇప్పటి వరకు ఆనవాయితీగా వచ్చింది. బట్ ఫర్ ఏ చేంజ్ అనుకున్నారో ఏమోగానీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఒకే నిర్ణయంపై అటు బ్యాటర్, ఇటు బౌలర్ కలిపి రెండుసార్లు డిఆర్ఎస్ కోరుకోగా.. బ్యాటర్ కు అనుకూలంగా నిర్ణయం రావడం గమనార్హం.
ఎంపైర్ నిర్ణయంపై డిఆర్ఎస్ తీసుకున్న బ్యాటర్..
ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆడుతున్నాడు. అశ్విన్ దుండిగల్ జట్టు తరుపున తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. దుండిగల్ డ్రాగన్స్, బాల్చే త్రిచి జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దుండిగల్ జట్టు తరఫున ఆడిన అశ్విన్.. 12.5 ఓవర్ బౌలింగ్ చేస్తుండగా.. బంతిని త్రిచీ బ్యాటర్ రాజ్ కుమార్ ఎదుర్కొన్నాడు. ఈ బంతిని బ్యాటర్ ఎదుర్కొన్న తర్వాత కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బంతి బ్యాట్ ను తాకినట్లు అనిపించడంతో అశ్విన్ పెద్ద ఎత్తున అప్పీల్ చేశాడు. ఫీల్డ్ ఎంపైర్ కూడా దీని అవుట్ గా ప్రకటించాడు. దీనిపై బ్యాటర్ రాజ్ కుమార్ డిఆర్ఎస్ కు వెళ్లాడు. థర్డ్ ఎంపైర్ పుటేజి మొత్తం పరిశీలించగా బ్యాట్ నేలను తాకినట్లు తేలింది. దీంతో థర్డ్ ఎంపైర్ నాట్ అవుట్ గా దాన్ని ప్రకటించడంతో ఫీల్డ్ ఎంపైర్ దాన్ని సరి చేసే ప్రయత్నంలో భాగంగా నాటౌట్ గా ప్రకటించాడు.
రెండో డిఆర్ఎస్ కోరుకున్న రవిచంద్రన్ అశ్విన్..
థర్డ్ ఇచ్చిన నిర్ణయం పట్ల సంతృప్తి చెందని రవిచంద్రన్ అశ్విన్.. ఎంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించిన వెంటనే డిఆర్ఎస్ కావాలంటూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మరోసారి సదరు బంతి గమనాన్ని థర్డ్ ఎంపైర్ పూర్తిగా పరిశీలించి మళ్లీ నాటౌట్ గా ప్రకటించాడు. ఈ విధంగా డిఆర్ఎస్ కు వెళ్లిన తరువాత థర్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోసారి డిఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిగా అశ్విన్ నిలిచాడు. డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ నిర్ణయం అనుకూలంగా రాకపోవడంతో అశ్విన్ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ కనిపించాడు.
అందుకే మరోసారి డిఆర్ఎస్ కు వెళ్లానన్న అశ్విన్..
మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ డిఆర్ఎస్ కు రెండోసారి వెళ్లడంపై స్పందించాడు. ఈ టోర్నీకి డిఆర్ఎస్ కొత్తగా అమలులోకి వచ్చిందని, బ్యాటును బంతి దాటేటప్పుడు స్పైక్స్ కనిపించడం వల్లే మరోసారి డిఆర్ఎస్ కు వెళ్లినట్లు అశ్విని చెప్పుకొచ్చాడు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం సరిగా లేకపోవడంతో నిరుత్సాహానికి గురైనట్లు అశ్విన్ వివరించాడు. దానివల్లే మళ్లీ డిఆర్ఎస్ కోరుకున్నట్లు స్పష్టం చేశాడు అశ్విన్. ఇకపోతే ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహించిన దుండిగల్ డ్రాగన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. త్రిచి నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే డ్రాగన్స్ ఛేదించి ఘన విజయం సాధించింది.