Rashid Khan: ఎవరైనా బలంగా కొడతారు. లేదా కోపంతో కొడతారు. కానీ అతడు శ్రద్ధగా కొట్టాడు. గోడకు సున్నం వేసినట్టు, పెరట్లో చెట్లకు నీళ్లు పోసినట్టు, తులసి చెట్టు గుమ్మానికి పసుపు రుద్దినట్టు.. చాలా శ్రద్ధగా కొట్టాడు. చదువుతుంటే అతడు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తోంది కదూ.. ఆ బ్యాటర్ కొట్టిన సిక్స్ చూస్తే మీక్కూడా అలానే అనిపిస్తుంది. అతడు కొట్టిన తీరుకు బంతి ఎక్కడో స్టేడియం అవతల పడింది. ఇంతటి భారీ సిక్స్ కొట్టిన ఆటగాడు పేరు మోసిన బ్యాటర్ కాదు. బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్. అన్నట్టు ఈ స్పిన్నర్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో రషీద్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. చాలా సంవత్సరాల పాటు ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఆడాడు. తనదైన శైలిలో బంతులను మెలికలు తిప్పుతూ వికెట్లను పడగొట్టేవాడు. హైదరాబాద్ జట్టులో కీలకమైన బౌలర్ గా కొనసాగాడు. ప్రస్తుతం అతడు గుజరాత్ జట్టుకు ఆడుతున్నాడు. అతడిని ఆ జట్టు యాజమాన్యం 15 కోట్లకు కొనుగోలు చేసింది. తనదైన రోజు అద్భుతాలు చేయగల సత్తా రషీద్ ఖాన్ సొంతం.
బంతిని మెలికలు తిప్పుతూ, బ్యాటర్లను ఇబ్బంది పెట్టే రషీద్ ఖాన్ ఐర్లాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో బ్యాటర్ అవతారం ఎత్తాడు. ఆ జట్టుతో జరుగుతున్న రెండవ టి20 మ్యాచ్లో పేసర్ మెక్ వర్తీ వేసిన ఫుల్ టాస్ బంతిని రషీద్ తెలివిగా ఆడాడు. డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్టేడియం అవతలికి పంపించాడు. రషీద్ బ్యాట్ దెబ్బకు బంతి గాల్లో తేలుకుంటూ మైదానం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్లో రషీద్ 24 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ మీద విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో నబి 59, అటల్ 35, రషీద్ 25 పరుగులు చేశారు. చేజింగ్ కు దిగిన ఐర్లాండ్ 8 వికెట్ల కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన 25 పరుగులు చేసి, 4 వికెట్లు తీసి రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
అంతకుముందు ఈ రెండు జట్ల మధ్య ఒక టెస్ట్ జరగగా.. ఐర్లాండ్ గెలిచింది. టెస్ట్ అనంతరం 3 వన్డేల సిరీస్ జరిగింది. ఒక వన్డే వర్షం వల్ల రద్దు కాగా, మిగతా మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. ప్రస్తుతం 3 t20 ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కైవసం చేసుకుంది. మరో టి20 షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది.
The swag in Rashid Khan’s shot. pic.twitter.com/N7eDsfA7Ii
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024