Homeక్రీడలురాజస్థాన్ vs పంజాబ్: గెలుపెవరిది?

రాజస్థాన్ vs పంజాబ్: గెలుపెవరిది?

RR vs PBKS
ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద.. సూపర్‌‌ సిక్స్‌లు.. కళ్లు చెదిరే ఫోర్లు.. ఊహకందని డైవ్‌లు.. వెరసి క్రికెట్‌ ప్రేక్షకులు పండుగ వాతావరణంలో ఉన్నారు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా జట్లు తలపడ్డాయి. ఇక సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా.. రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్ తొలి సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేకపోయింది. పాయింట్ పట్టికలో ఎప్పుడూ చివరి నాలుగు స్థానాల్లో ఉండే రాయల్స్.. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో యాజమాన్యం అతడిని ఈ సీజన్‌లో విడుదల చేసి.. యువ క్రికెటర్ సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

పంజాబ్ కింగ్స్ పేరుతో సరికొత్తగా అడుగుపెడుతున్న ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. అత్యధిక పరుగులతో ఆరేంజ్‌ క్యాప్‌ను సైతం సాధించాడు. గత సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే దూకుడు ప్రదర్శించి సీజన్ సగం అయ్యే సరికి పాయింట్స్ టేబుల్‌లో మంచి స్థానంలో ఉన్నది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌తో జట్టును నడిపించారు. కానీ.. క్రమంగా మ్యాచ్‌లు ఓడుతూ ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకున్నది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను సగం మ్యాచ్‌లు ఆడించకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివర్లో మ్యాచ్‌లు ఓడిపోయి చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి కూడా రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్ దూకుడుగా ఆడగలరు. ఈ సారి జట్టుతో కొత్తగా చేరిన షారుక్ ఖాన్, ఫాబియన్ అలెన్ జట్టుకు కొత్త ఊపు తేగలరని భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, క్రిస్ జోర్డాన్, జే రిచర్డ్‌సన్‌కు తోడు రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ వంటి ఛాయిస్‌లు ఉన్నాయి.

2020 ఐపీఎల్‌ ఈ ఇరుజట్ల ఆటను ఒకసారి పరిశీలిస్తే.. మయాంక్‌ సంప్రదాయ ఆటగాడు. మరీ వేగంగా పరుగులు చేయడనే పేరుంది. కానీ.. నాటి 2020లో అతడి ఉగ్రరూపం మరో కోణాన్ని చూపించింది. అతడిలో ఇంత దూకుడుందా? ఇంత వేగంగా ఆడతాడా? ఇలాంటి షాట్లు బాదేస్తాడా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. 50 బంతుల్లో 106 పరుగులు చేశాడు. 7 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేశాడు. జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కరన్‌ వంటి పేసర్లకే చుక్కలు చూపించాడు.

ఆ మ్యాచ్‌లో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. అదీ మరో 3 బంతులు మిగిలుండగానే. గెలుపు ధీమాతో ఉన్న పంజాబ్‌ను మట్టికరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గెలుపోటములను పక్కన పెడితే ఆనాడు షార్జా సిక్సర్ల జడివానకు తడిచి ముద్దైంది. పరుగుల వరదకు సాక్ష్యంగా మారింది. అభిమానులను మైమరపించింది.

కష్టసాధ్యమైన ఛేదనకు దిగిన రాజస్థాన్‌ 2.2వ బంతికే బట్లర్‌ (4) వికెట్‌ కోల్పోయింది. కానీ.. సునామీ అప్పుడే మొదలైంది. అగ్నికి వాయువు తోడైనట్టు స్టీవ్‌స్మిత్‌ (50; 27 బంతుల్లో 7×4, 2×6), సంజు శాంసన్‌ (85; 42 బంతుల్లో 4×4, 7×6) తోడయ్యాడు. కాట్రెల్‌, షమి, నీషమ్‌.. ఎవ్వరొచ్చినా సిక్సర్లు బాదడమే పని. దాంతో రాజస్థాన్‌ 9 ఓవర్లకే 100/2 పరుగులు చేసేసింది. స్మిత్‌ ఔటైన తర్వాత పెద్దగా ఎవ్వరికీ తెలియని రాహుల్‌ తెవాతియాను క్రీజులోకి పంపించి పెద్ద తప్పిదమే చేసినట్టు కనిపించింది. 10 ఓవర్లకు 104/2తో ఉన్న రాజస్థాన్‌ 15 ఓవర్లకు 140/2తో నిలిచింది.

ఇంతలోనే 16వ ఓవర్లో 3 సిక్సర్లు బాదేసిన సంజును 16.1వ బంతికి షమి ఔట్‌ చేయడంతో షాక్‌ తగిలింది. రాబిన్‌ ఉతప్ప క్రీజులోకి వచ్చాడు. మరోవైపు 19 బంతులాడి 8 పరుగులే చేసిన రాహుల్‌ తెవాతియాపై గెలిపిస్తాడన్న నమ్మకమే లేదు. అందులోనూ అతడు ఒక్క బౌండరీ బాదలేదు. ఇక పంజాబ్‌ పట్టుబిగించినట్టే కనిపించింది. కానీ.. ఆడిన ఆఖరి 12 బంతుల్లో ఏకంగా 45 పరుగులు సాధించాడు తెవాతియా. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు. 19వ ఓవర్లో మెలోడ్రామా నడిచింది. తొలి బంతికి ఉతప్ప ఔట్‌. రావడం రావడమే తర్వాతి రెండు బంతుల్ని ఆర్చర్‌ సిక్సర్లుగా మలిచాడు. ఐదో బంతిని స్టేడియం దాటించిన తెవాతియా చివరి బంతికి ఔటయ్యాడు. కానీ, స్కోరు 222కు చేరడంతో విజయం ఖాయమైపోయింది.

ఐపీఎల్‌ 2021లో రాజస్థాన్‌, పంజాబ్‌ సోమవారం తలపడుతుండటంతో అంచనాలు పెరిగాయి. సంజు శాంసన్‌ రాజస్థాన్‌ సారథిగా ప్రమోషన్‌ పొందాడు. ఇటువైపు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడతనిపై భారం తగ్గింది. డేవిడ్‌ మలన్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ అగర్వాల్‌, షారుఖ్‌ ఖాన్‌ ఉండటంతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడతాడని బ్యాటింగ్‌ కోచ్‌ జాఫర్‌ ముందే చెప్పేశాడు. బౌలింగ్‌ విభాగాన్నీ పటిష్ఠం చేసుకుంది. షమి, జోర్డాన్‌కు మెరీడిత్‌, రిచర్డ్‌సన్‌ అండగా ఉన్నారు. రాజస్థాన్‌ సైతం లివింగ్‌స్టన్‌, క్రిస్‌ మోరిస్‌, ముస్తాఫిజుర్‌, శివమ్‌ దూబెను కొనుగోలు చేసింది. ఈ రెండు జట్లు గతేడాది తరహాలోనే అభిమానులను మురిపిస్తాయేమో చూడాలి!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular