Pro Kabaddi League: మనం పెంచిన మొక్క.. రోజు నీళ్లు పోసి.. ఎరువు వేసి పెంచిన మొక్క.. పూలు పూస్తే ఎలా ఉంటుంది.. ఆ పూలు కాయలు కాస్తే ఎలా ఉంటుంది.. ఆ ఆనందం మామూలుగా ఉండదు. పైగా పదిమందికి చెప్పుకోవాలనిపిస్తుంది. పదిమందితో పంచుకోవాలనిపిస్తుంది. అలాంటి మొక్కలను ఇంకా చాలా వేయాలి అనిపిస్తుంది. కష్టపడ్డ తర్వాత ఫలితం వస్తే ఆ ఆనందం మరో విధంగా ఉంటుంది. అలాంటి ఆనందమే ఈ కోచ్ కూడా అనుభవించాడు. గుండెల నిండా ఆనందాన్ని నింపుకున్నాడు.
గ్రామీణ క్రీడ కబడ్డీ కార్పొరేట్ రూపు సంతరించుకున్న తర్వాత.. ప్రొ కబడ్డీ లీగ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో అనేక కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. సొంతంగా జట్లను కొనుగోలు చేశాయి. గత కొన్ని సీజన్లుగా ఈ లీగ్ విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏడాది కొత్త జట్టు విజేతగా పుట్టుకొస్తుంది.. కార్పొరేట్ కంపెనీలు కబడ్డీ లీగ్ నిర్వహిస్తున్నప్పటికీ.. ఆటలో మజా ఏమాత్రం తగ్గడం లేదు. పైగా సరికొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కబడ్డీ అనేది సరికొత్తగా కనిపిస్తోంది. ఈ లీగ్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు.. కొంతమంది క్రీడాకారులు కెరియర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
కబడ్డీ లీగ్ లో ఆడే ఆటగాళ్లకు శిక్షణ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆధునిక ప్రమాణాలతో శిక్షణ ఇస్తూ ఉంటారు. అందువల్లే ఆటగాళ్లు మెరికల మాదిరిగా ఆడుతుంటారు. ఆటగాళ్లకు ఆ స్థాయిలో శిక్షణ ఇవ్వడంలో కోచ్ లు తీవ్రంగా కష్టపడుతుంటారు. రేయింబవళ్లు శిక్షణ ఇవ్వడంలోనే బిజీగా ఉంటారు. అయితే కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ కు విశేషమైన పేరు ఉంది. అయితే గత కొన్ని సీజన్లుగా తెలుగు జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం లేదు. అయితే ఈసారి మాత్రం తెలుగు టైటాన్స్ జట్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
తెలుగు టైటాన్స్ జట్టుకు క్రిషన్ కుమార్ హుడా కోచింగ్ ఇస్తున్నారు. ఈయన శిక్షణలో తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. బలమైన పాట్నా జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది.. జట్టు గెలిచిన తర్వాత కోచ్ ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ ప్రయాణాన్ని కన్నీరు పెట్టుకుంటూనే చెప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.