Portugal vs Morocco : బ్రెజిల్ ఇంటిదారి పట్టి ఒకరోజు కాకుండానే.. ఫుట్బాల్ ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదయింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో బలహీనమైన మొరాకో జట్టు బలమైన పోర్చుగల్ ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. దర్జాగా సెమి ఫైనల్ కి వెళ్ళింది. ఈ ఓటమితో జట్టు పోర్చుగల్ ఆటగాళ్లు రొనాల్డో, పెపెల కెరీర్ ముగిసినట్టే. ఈ విజయంతో ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచకప్ సెమిస్ చేరిన తొలి జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
మ్యాచ్ జరిగింది ఇలా..
మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి దాదాపు పోర్చుగల్ బంతిని తన నియంత్రణలో ఉంచుకుంది.. దీంతో బంతిని దొరక పుచ్చుకునేందుకు మొరాకో ఆటగాళ్లు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆట ప్రారంభమైన 42వ నిమిషంలో మొరాకో ఆటగాడు నెసిరి గోల్ సాధించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. వాస్తవానికి మొరాకో జట్టు ఇంతవరకు క్వార్టర్ ఫైనల్ ముఖం చూడలేదు. కానీ ఈసారి ప్రపంచకప్ లో విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా ఆ జట్టు ఆడుతోంది. టోర్నీ ప్రారంభం నుంచి అంచనాలకు మించి ప్రదర్శనలు చేస్తోంది.
అవకాశాలు సృష్టించుకోలేదు
పోర్చుగల్ బంతిని నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయింది. ఆట ఐదో నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు ఫెలిక్స్ గోల్ చేసే ప్రయత్నాన్ని మొరాకో గోల్ కీపర్ బౌ నౌ అడ్డుకున్నాడు. ఒకవేళ ఈ బంతి గోల్ అయితే ఆటస్వరూపం మరో విధంగా ఉండేది. అంతేకాదు ఎలాగైనా గెలవాలి అనే కసితో మొరాకో చాలా సార్లు పోర్చుగల్ నెట్ దిశగా దూసుకు వచ్చింది. అయితే ఆట 26వ నిమిషం లో మొ రాకో ఆటగాడు జియోచ్ ప్రీజిక్ ను నెసిరి తలతో క్రాస్ బార్ పైకి కొట్టాడు. కానీ అది గోల్ కాలేక పోయింది. ఒకవేళ అది కనుక గోల్ అయి ఉంటే మొరాకో ఆధిక్యం 2 కు చేరుకునేది. అయితే ఆ తర్వాత పోర్చుగల్ జట్టు నెసిరి ప్రయత్నాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. ఆట ప్రధమార్ధం అఖరిలో నెసిరి అద్భుతమైన హైడర్ తో మొరాకో ఆధిక్యంలోకి వెళ్ళింది. అతియాత్ క్రాస్ ఇవ్వగా… నెసిరి బంతిని తలతో కొట్టి పోర్చుగల్ గోల్ కీపర్ కోస్టా ను బోల్తా కొట్టించాడు.
పాపం పోర్చుగల్
ఆట ద్వితీయార్థంలో గోల్ సాధించేందుకు పోర్చుగల్ చేయని ప్రయత్నం అంటూ లేదు. మొరాకో జట్టు అడ్డు గోడలా నిలబడి పోర్చుగల్ జట్టును పూర్తిగా నిలువరించగలిగింది. 83వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు ఫెలిక్స్ షాట్ మొరాకో ఆటగాడు బౌ నౌ గొప్పగా అడ్డుకున్నాడు. ఇంజురీ సమయం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుంది అనుకునే దశలో మొరాకో ఆటగాడు చెదిరా ఎర్ర కార్డుతో మైదానాన్ని వీడటం ఆ జట్టుకు పెద్ద షాక్. కానీ పదిమందికే జట్టు పరిమితమైనప్పటికీ తన ఆధిక్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లోనూ పోర్చుగల్ ఆటగాడు రొనాల్డో ను ఆ దేశ కోచ్ సబ్స్టిట్యూట్ ఆటగాడిగా దించడం గమనార్హం.
రొనాల్డో కన్నీరు
మ్యాచ్ ఓటమి అనంతరం రొనాల్డో కన్నీరు పెట్టుకున్నాడు. బోరున విలపించాడు. ఎందుకంటే ఇదే అతడి చివరి టోర్నీ. ఎలాగైనా ఈసారి కప్ సాధించి తన కెరీర్ కి ఘనమైన ముగింపు పలకాలి అనుకున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే.. మొరాకో ఒకటి తలచింది. ఫలితంగా పోర్చుగల్ ఇంటిదారి పట్టింది.