Nitish Reddy criticism: అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. మెల్బోర్న్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ ఆడుతోంది. టీమిండియా ప్లేయర్లు మొత్తం విఫలమయ్యారు.. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు వచ్చాడు.. కళాత్మకమైన స్ట్రోక్స్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.. రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. అద్భుతంగా ఆడావు అంటూ ప్రశంసించారు. నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులను ప్రశంసలతో ముంచెత్తారు.
ఆ ఇన్నింగ్స్ తర్వాత టెస్టులలో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం స్థిరమైపోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన తెలుగు కుర్రాడు విఫలమవుతున్నాడు. బౌలింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్లో నిరాశ పరుస్తున్నాడు. ఆల్ రౌండర్ కేటగిరీలో జట్టులోకి వచ్చిన అతడు.. ఆ పదానికి సరైన అర్థాన్ని ఇచ్చే దిశగా ఆడలేక పోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఇన్నింగ్స్ లలో 103 పరుగులు మాత్రమే చేశాడంటే అతని బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలింగ్ కూడా అంతంతమాత్రంగానే ఇస్తున్నాడు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తన కెరియర్ ముగించాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గడచిన పది ఇన్నింగ్స్ లలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ పరిశీలిస్తే 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0 పరుగులు చేశాడు.. హాఫ్ సెంచరీ కాదు కదా రెండుసార్లు డక్ అవుట్ అయ్యాడు. నాలుగుసార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. వరుసగా విఫలం అవుతున్నప్పటికీ గౌతమ్ గంభీర్ అతడి మీద నమ్మకం ఉంచాడు. కానీ ఆ నమ్మకాన్ని రెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. విదేశీ మైదానాలు మాత్రమే కాదు, స్వదేశీ మైదానాలలో కూడా విఫలమవుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంత దారుణంగా క్రికెట్ ఆడుతుండడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకు పోయారు. అజరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ స్థాయిలో ఆడాల్సిన నితీష్ కుమార్ రెడ్డి.. నాసిరకమైన గల్లీ ఆటను ఆడుతుండడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలర్లు మాత్రమే కాదు, స్పీన్ బౌలర్లను కూడా ఎదుర్కోలేకపోతున్నాడు. పైగా బంతులను డిఫెన్స్ చేయడంలో పూర్తిగా తడబడుతున్నాడు. బౌలింగ్ లో కూడా దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. ప్లేయర్లను ఇబ్బంది పెట్టే విధంగా బంతులు వేయడంలో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. అందువల్లే రెండో టెస్టులో కెప్టెన్ పంత్ నితీష్ కుమార్ రెడ్డికి బంతిని ఇవ్వడానికి నిరాకరించాడు. దీనినిబట్టి అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా చేసిన తప్పులను పునరావృతం కాకుండా సమర్థవంతమైన క్రికెట్ ఆడితే నితీష్ కుమార్ రెడ్డికి ఫ్యూచర్ ఉంటుంది. లేకుంటే ఒకప్పుడు తెలుగు క్రికెటర్ టీమిండియాలో ఆడేవాడు అని చెప్పుకునేలాగా చెత్త చరిత్ర ఉంటుంది. ఏది కావాలో డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మీద ఉంది.