PBKS Vs RCB IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్లో మరో జట్టు కథ ముగిసింది. ఇప్పటికే ముంబై జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు ఆ జట్టుకు పంజాబ్ కూడా తోడైంది.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించి, బెంగళూరు చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఎలిమినేట్ అయిన రెండవ టీం గా పంజాబ్ జట్టు నిలిచింది.. ఈ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించిన బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలను ఇప్పటివరకు అయితే సజీవంగా ఉంచుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు బీభత్సంగా ఆడింది. వాస్తవానికి ఈ మైదానం బౌలింగ్ కు అనుకూలిస్తుంది.. కానీ, బెంగళూరు ఆటగాళ్లు దానిని పూర్తిగా మార్చేశారు. 20 ఓవర్లలో 241 రన్స్ కొట్టేశారు. విరాట్ కోహ్లీ 47 బాల్స్ లో 7 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. 8 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. రజత్ పాటిదార్ 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేశాడు.. అతడు ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది.. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ (3/38), కవెరప్ప (2/36) ఆకట్టుకున్నారు.
బెంగళూరు విధించిన 242 విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ చేతులెత్తేసింది. కేవలం 181 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ జట్టులో రొసో (61; 27 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. సిరాజ్(3/43), స్వప్నిల్ సింగ్ (2/28), ఫెర్గు సన్ (2/29), కర్న్ శర్మ (2/36) వికెట్లు తీసి, పంజాబ్ జట్టును కోలుకోకుండా చేశారు.
లక్ష్యం భారీగా ఉండటంతో.. బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 6 పరుగులకే స్వప్నిల్ చేతిలో తొలి ఓవర్ లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రొసో పంజాబ్ బ్యాటింగ్ నమూనాను మొత్తం మార్చేశాడు.. బెయిర్ స్టో(27; 16 బంతుల్లో, 4 ఫోర్లు, ఒక సిక్స్) తో కలిసి స్కోర్ బోర్డును ఉరకలు పెట్టించాడు. ఫోర్ పాయింట్ వన్ ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేయించాడు. ఆరో ఓవర్లో బెయిర్ స్టో అవుట్ అయినప్పటికీ రొసో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 21 బాల్స్ లో అర్థ సెంచరీ కొట్టేశాడు. అయితే ఇతడిని కర్న్ శర్మ అవుట్ చేశాడు..
రొసో అవుటయ్యే సమయానికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ దశలో ధాటిగా ఆడాల్సిన పంజాబ్ ఆటగాళ్లు పంజాబ్ బౌలర్ల ఎదుట లొంగి పోయారు.. 56 పరుగుల వ్యవధిలోనే మిగతా ఏడు వికెట్లు కోల్పోయారు. శశాంక్ 37, సామ్ కరణ్ 22 పరుగులు చేసి అవుట్ కావడంతో.. పంజాబ్ ఓటమి దాదాపుగా ఖాయం అయిపోయింది..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరుకు గట్టి ఆరంభం లభించలేదు.. వర్షం కురవడంతో మ్యాచ్ లో కొంతసేపు అంతరాయం ఏర్పడింది.. బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసెస్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 12 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఈ క్రమంలో రజత్ పాటిధార్, విరాట్ కోహ్లీ బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని భుజానికి ఎత్తుకున్నారు. బెంగళూరు ఇన్నింగ్స్ 10 ఓవర్ వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ ను కొంతసేపు నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ మొదలుపెట్టారు.. రజత్, కామెరున్ గ్రీన్, ఆకట్టుకున్నారు.. 92 పరుగులు చేసిన కోహ్లీ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ఏడు బంతుల్లో 18 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 77 రౌండ్ చేయడం విశేషం.. అయితే చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ కేవలం మూడు పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీయడం విశేషం.