PBKS vs CSK, IPL 2022: ఈ సీజన్ ఐపీఎల్‌లో సోమవారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 88 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు.
అయితే 188 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనీ ఉండటంతో మరోసారి గత మ్యాచ్‌లోని మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశపడ్డారు. అంతేకాకుండా మరోవైపు రవీంద్ర జడేజా కూడా ఉండటంతో సీఎస్‌కే అభిమానులు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు.
Also: Mahesh Babu: ‘కేజీఎఫ్ 2’ మహేష్ కు నచ్చలేదా ? అందుకే మౌనంగా ఉన్నాడు ?
పంజాబ్ బౌలర్ రిషి ధావన్ 20వ ఓవర్ వేశాడు. అతడి తొలి బంతిని ధోనీ భారీ సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత యార్కర్లతో వైవిధ్యం చూపిన రిషి ధావన్ ఓ అద్భుత బంతితో ధోనీని పెవిలియన్‌కు చేర్చడంతో అభిమానుల ఆశలు తలకిందులయ్యాయి. జడేజా కూడా ఓ సిక్సర్ బాదినా ఆ షాట్ చెన్నై జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో అంతకుముందు రాయుడు ఆడిన ఇన్పింగ్స్ వృధా అయ్యింది. అతడు 39 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 78 పరుగులు చేశాడు.
అయితే పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాయుడి చేతికి గాయమైంది. దాంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఛేదనలో గాయంతోనే ఆడిన రాయుడు అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఓ రకంగా రాయుడు ఇన్నింగ్స్ కారణంగానే చెన్నై మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. కాగా చెన్నైకి టోర్నీలో ఇది ఆరో ఓటమి. పంజాబ్‌కు మాత్రం నాలుగో గెలుపు. పాయింట్ల పట్టికలో పంజాబ్ 6వ స్థానంలో, చెన్నై 9వ స్థానంలో నిలిచాయి.