Paris Olympics 2024: మను భాకర్ సరికొత్త రికార్డు.. మరో కాంస్య పతకం తో అరుదైన ఘనత..

మను తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సరబ్ జోత్ సింగ్ కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. ఈ విజయం సాధించిన అనంతరం మను , సరబ్ జోత్ సింగ్ ఉద్వేగంగా మాట్లాడారు. " ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో రెండవ మెడల్ సాధించినందుకు ఆనందంగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 30, 2024 3:24 pm

Paris Olympics 2024

Follow us on

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికే షూటింగ్ లో కాంస్య పతకాన్ని సాధించి భారత ఖాతాను తెరిచిన ఆమె.. పది మీటర్ల పిస్టల్ మిక్స్ డ్ టీం విభాగంలో సరబ్ జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో దక్షిణకొరియా ద్వయం జుయీ లీ – వోన్షోలీ పై మను భాకర్ – సరబ్ జోత్ సింగ్ 16-10 పాయింట్లు తేడాతో ఘనవిజయం సాధించి, కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఘనవిజయం ద్వారా ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలిభారత అథ్లెట్ గా మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో మను భాకర్ ఇటీవల కాంస్య పతకాన్ని సాధించింది. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో ఏకంగా రెండు మెడల్స్ సాధించిన మూడవ భారత అథ్లెట్ గా మను భాకర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. రెజ్లర్ సుశీల్, షట్లర్ పివి సింధు రెండు మెడల్స్ సాధించారు.

మను తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సరబ్ జోత్ సింగ్ కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. ఈ విజయం సాధించిన అనంతరం మను , సరబ్ జోత్ సింగ్ ఉద్వేగంగా మాట్లాడారు. ” ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో రెండవ మెడల్ సాధించినందుకు ఆనందంగా ఉంది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రోత్సహించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు. ఈ పోరులో ముందుగా మేము మా వ్యూహాన్ని పకడ్బందీగా చర్చించుకున్నాం. పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నాం. దానికి తగ్గట్టుగానే మా షూటింగ్ సాగింది. మా షూటింగ్ పట్ల సంతృప్తితో ఉన్నాం. ఇన్నాళ్లకు మా శ్రమకు ఫలితం దక్కింది. తీవ్రంగా కష్టపడిన తర్వాత కాంస్యం ఆనందాన్ని నింపింది. ఈ మెడల్ భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. పారిస్ వేదికగా మూడు రంగుల జెండా రెపరెపలాడిందని చెప్పడానికి వీచిక. తీవ్రమైన పోటీ మధ్య మేము ఈ మెడల్ సాధించాం. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చామని భావిస్తున్నాం. ఈ షూటింగ్ ఏకంగా 13 సిరీస్ ల పాటు సాగింది. ఉత్కంఠ గా సాగిన ఈ పోరులో దక్షిణ కొరియాపై పై చేయి సాధించడం గొప్ప విషయమని” మను భాకర్, సరబ్ జోత్ సింగ్ పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ పోరు ఏకపక్షంగా సాగలేదు. ముందుగా దక్షిణ కొరియా షూటర్లు భారత షూటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏకంగా 13 సిరీస్ ల పాటు షూటింగ్ జరిగిందంటే.. దక్షిణ కొరియా షూటర్లు ఏ స్థాయిలో షూటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కాంస్య పతకం పోరులో ఈ పోటీ జరిగింది. ముందుగా మను బాకర్ తనదైన శైలిలో షూటింగ్ చేయగా.. ఆ తర్వాత సరబ్ లైన్లోకి వచ్చాడు. అతడు కూడా సరిగ్గా గురిపెట్టడంతో దక్షిణ కొరియా స్కూటర్లు తేలిపోయారు. దీంతో 13 రౌండ్ల షూటింగ్లో భారత్ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా షూటర్లు 10 పాయింట్లు మాత్రమే సాధించారు. ముఖ్యంగా 9 నుంచి 13వ రౌండ్ వరకు ఏకపక్షంగా సాగాయి. మను, సరబ్ అద్భుతంగా షూటింగ్ చేసి భారత్ కు కాంస్య పతకం ఖాయం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.. సోషల్ మీడియాలో మను, సరబ్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.