T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చేసింది. అస్సలు గ్రూపు దశలోనే ఎలిమినేట్ అయిపోతుందని పాకిస్తాన్ జట్టును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పాక్ మాజీలు దుమ్మెత్తిపోశారు. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడి.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో మట్టికరించిన పాక్ కు సెమీస్ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. కానీ నవ్విన నాపచేనే పండినట్టు.. పాక్ కు అదృష్టం తోడైంది. సెమీస్ చేరాల్సిన దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. పాక్ నెత్తిన పాలు పోసింది. ఆ ఊపుతో వరుస మ్యాచ్ లు గెలిచి ఈ పొట్టి ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఫైనల్ చేరింది. అయితే ఇది అచ్చం 1992 కప్ లో పాక్ కు జరిగినట్టే జరిగింది. నాడు టీమిండియా చేతిలో తొలి మ్యాచ్ ఓడింది. ఇలానే అదృష్టం తోడై ఫైనల్ చేసింది. సెమీస్ లోనూ న్యూజిలాండ్ నే ఓడించింది. దీంతో 1992 వన్డే సీరీస్ రిపీట్ కానుందని నమ్మకం అందరిలోనూ ఏర్పడింది.

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. సరే అది నిజమే కావచ్చు కానీ. 1992 వన్డే వరల్డ్ కప్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. 2022 టి20 మెన్స్ వరల్డ్ కప్ లోనూ అలాంటివే పునరావృతమయ్యాయి. 1992 వన్డే వరల్డ్ కప్, 2022 టీ 20 ప్రపంచ కప్ లలో కూడా పాకిస్తాన్ జట్టు ఒకే మాదిరే ఫైనల్ కు చేరిన క్రమాన్ని గమనిస్తే ఒక పట్టాన నమ్మ బుద్ధి కాదు.
ఒకసారి ఆ విషయాలను గమనిస్తే… ఈ రెండు టోర్నీలకు ఆతిథ్యమిచ్చింది ఆస్ట్రేలియానే కావడం విశేషం. అలాగే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తమ టైటిల్ కాపాడుకోవడంలో విఫలమైంది. ఇక రెండుసార్లూ పాకిస్తాన్ తమ తొలి మ్యాచులను మెల్బోర్న్ లోనే ఓడాయి. అప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్ జట్టు భారత జట్టు చేతిలో ఓడిపోవడం గమనార్హం. అంతేకాదు సెమీస్ కు అదనపు పాయింట్ తో చివరి రోజు అర్హత సాధించింది. గ్రూప్ దశలో చివరి మూడు మ్యాచ్ లను గెలిచి ఫైనల్ చేరింది. సెమిస్లో న్యూజిలాండ్ పైనే గెలిచి ఫైనల్ కు వచ్చింది.. అప్పట్లో లెఫ్ట్ పేసర్లు వసీం అక్రమ్, షహీన్ ఎక్కువ వికెట్లు తీశారు. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తో ఆడింది. అది కూడా మెల్బోర్న్ లోనే.. చివరికి ఇంగ్లండ్ ను ఓడించి పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది.. మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు.
-1992 లో జరిగింది ఇదే
1992 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఎటువంటి ఆశలు లేకుండా టోర్నీలోకి అడుగు పెట్టింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ను నడిపించాడు. అదనపు పాయింట్ తో అదృష్టవశాత్తు సెమిస్లోకి వెళ్ళింది.. అప్పుడు సెమీస్ పోరులో న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టింది. వసీం అక్రమ్ లాంటి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ జట్టును మట్టి కరిపించింది. అదే ఊపులో ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. 1992 ప్రపంచ కప్ ను తొలిసారిగా ఒడిసి పట్టుకుంది. అప్పట్లో పాకిస్తాన్ జట్టు యువ రక్తంతో ఉరకలు ఎత్తింది. ఇప్పుడు కూడా జట్టులోని సభ్యులు అంతా యువకులే. దీంతో ఈసారి కూడా 1992 మ్యాజిక్ రిపీట్ చేసి రెండోసారి టి20 వరల్డ్ కప్ సాధించాలని ఉవ్విళ్లరుతున్నది.