Pakistan Ball Tampering: మందను చూసుకొని మొరిగితే అది బలం కాదు . అలాంటి బలం మనకు సొంతంగా ఉండాలి. స్వతహాగా మనలో కలగాలి. అలాంటి బలం తో ఎలాంటి పని అయినా చేయవచ్చు. అవసరమైతే ప్రత్యర్థిని మట్టికరిపించి మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు. విజేతగా నిలవచ్చు. కానీ ఇవేవీ పాకిస్తాన్ జట్టుకు చేతకాదు. నిందలు వేయడం.. అడ్డగోలుగా మాట్లాడడం.. దుమ్ము ఎత్తిపోయడం వంటివి మాత్రమే ఆ జట్టుకు చేతనవుతుంది.
పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా గెలికి మరీ వాసన చూసేది. ఆ జట్టులో ఉన్న అప్పటి సీనియర్ ఆటగాళ్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవారు. తాము మాత్రమే గొప్ప ప్లేయర్లం అన్నట్టుగా భావించుకునేవారు. మైదానంలో కూడా అలానే ప్రవర్తించేవారు. ఇలా ఎందుకు చేసేవారో.. ఇలా చేస్తే వాళ్లకు వచ్చిన ఉపయోగం ఏమిటో ఎప్పటికీ అంతుపట్టేది కాదు.
ఇటీవల ఆసియా కప్ లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత టీమ్ ఇండియా సారథి సూర్య కుమార్ యాదవ్ కరచాలనం చేయడానికి ఇష్టపడ లేదు. ఇది సహజంగానే పాకిస్తాన్ ప్లేయర్లకు ఇబ్బందిగా అనిపించింది. చెంపపెట్టు మాదిరిగా భావించి.. ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు చేశారు. మ్యాచ్ రిఫరీ సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఆ తదుపరి మ్యాచ్ ఆడేందుకు ఇష్టపడలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే కొద్దిసేపు వరకు కూడా మైదానంలోకి రాలేదు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు ఐసీసీ కఠినమైన హెచ్చరిక ఇచ్చింది. ఒకవేళ మీరు ఆడకుంటే కచ్చితంగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో దెబ్బకు పాకిస్తాన్ ప్లేయర్లు తోక ముడిచారు. చచ్చినట్టు మైదానంలోకి వచ్చి ఆడారు.
ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా పాకిస్తాన్ ఇలానే వ్యవహరించింది.
2006లో ఆగస్టు 20న ఇంగ్లాండ్ జట్టుతో పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారని అంపైర్లు గుర్తించారు. ఇంగ్లీష్ జట్టుకు ఏకంగా 5 పరుగులు పెనాల్టీ కింద ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్లేయర్లు వ్యతిరేకించారు. అంతేకాదు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి రావడానికి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ప్లేయర్లకు రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు మైదానంలోకి రాలేదు. దీంతో మైదానంలోకి అంపైర్లు ప్రవేశించి.. వికెట్ల మీద ఉన్న బెయిల్స్ తీసేశారు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ ఆటలో పాల్గొనే క్రీడాకారులు జెంటిల్మెన్ ల మాదిరిగానే ప్రవర్తించాలి. అలా కాకుండా క్రికెట్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇదిగో చివరికి ఇలాంటి ఫలితమే ఎదురవుతుంది.