Olympic : ఎవరికైనా సొంత దేశం ఉంటుంది. సొంత ప్రాంతం ఉంటుంది. సొంత జెండా ఉంటుంది. సొంత మనుషులు ఉంటారు. కానీ వీరికి అవేవీ లేవు. చెప్పుకోవడానికి దేశం లేదు. గుండె ఉప్పొంగేలా ప్రదర్శించేందుకు సొంత జెండా లేదు. అభిమానించే అనుచర గణం లేదు. ప్రేమించే ప్రేక్షకులు లేరు. అయినప్పటికీ వారు ఆడుతున్నారు. ఆట మీద ప్రేమతో ఆడుతున్నారు. ఆట మీద మమకారంతో ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు. నిలువ నీడ కోసం ప్రాదేయ పడుతున్నవారు.. బతుకు భారంగా జీవిస్తున్న వారు.. ఆటను మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు.. ఇంతకీ ఎవరు వారు.. ఎందుకు పోటీ పడుతున్నారు.. వారి అసలు లక్ష్యం ఏమిటి?
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చింది
అంతర్జాతీయ ఒలంపిక్స్ త్వరలో పారిస్ వేదికగా జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు శరణార్థి ఆటగాళ్లకు ఐఓసీ అవకాశం కల్పించింది… వాస్తవానికి ప్రపంచంలో యుద్ధం, అంతర్గత కలహాలు, అరాచక పాలన, ఉపాధి లేకపోవడం వంటి కారణాలవల్ల శరణార్థులుగా మారిన వారు 10 కోట్ల మంది దాకా ఉంటారు. అలాంటివారికి ఎక్కడో ఒకచోట ఆశ్రయం లభించినప్పటికీ.. ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన జీవితం లభించడం లేదు. కొత్త ప్రాంతంలో వారు ఆర్థికంగా స్థిరపడేందుకు, ఉపాధి పొందేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి చోట బతకడమే కష్టం. కానీ కొంతమంది మాత్రం ఎన్ని ప్రతి బంధకాలు ఎదురవుతున్నప్పటికీ ఆటపై మమకారాన్ని చంపుకోలేదు. ఎలాంటి అవకాశాలు లేకపోయినప్పటికీ ధైర్యంగా తాము ఉన్నచోటే.. సొంతంగా ఆటలో నైపుణ్యం సాధించారు. అత్యున్నత స్థాయిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరికి 2016 లోనే రియో వేదికగా ఐఓసీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత టోక్యోలో, ప్రస్తుతం పారిస్ లో జరిగే పోటీలకు ఒలింపిక్ కమిటీ ఈ ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించింది.
11 దేశాల నుంచి
పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ పోటీలకు ఈసారి 11 దేశాల నుంచి 37 మంది ఆటగాళ్లు శరణార్థుల బృందంలో ఉన్నారు. 12 క్రీడలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటివరకు ఒలింపిక్ చరిత్రలో శరణార్థి ఆటగాళ్లు ఎవరు కూడా పతకాలు సాధించలేదు. వాస్తవానికి గెలవడం కంటే వారికి ఒలింపిక్స్ లాంటి అత్యున్నత పోటీలలో పాల్గొనడం గొప్ప విషయం. ఇలాంటి చోట వారు తమ గళాన్ని వినిపించేందుకు గొప్ప వేదికగా భావిస్తున్నారు. 2020 ఒలింపిక్స్ లో శరణార్థుల క్రీడాకారిణిగా ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి మోసోమా అలీ జాదా పోటీపడింది. ఈసారి శరణార్థి ఆటగాళ్ల బృందానికి ఆమె చెఫ్ డి మిషన్ గా వ్యవహరిస్తోంది. ఏదో తప్పనిసరి తద్దినంలా కాకుండా.. పకడ్బందీగా ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా ఈ జట్టు ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకుంది.
ప్రపంచానికి తెలుస్తుంది
ఒలింపిక్ లాంటి వేదికలపై తాము వివిధ క్రీడాంశాలలో పోటీ పడితే.. తాము పడుతున్న బాధ ప్రపంచానికి తెలుస్తుందని శరణార్థి ఆటగాళ్లు అంటున్నారు. ఇప్పటివరకు తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. బతకడానికి కష్టాలు పడ్డామని.. ఆటలో నైపుణ్యం సాధించేందుకు నరకం చూసామని.. వచ్చే తరం కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము ఒలింపిక్ లాంటి వేదికల వద్ద ప్రదర్శనలు చేస్తున్నామని ఆటగాళ్లు అంటున్నారు. మరి ఆటగాళ్ల ఆవేదనను ఆయాదేశాలు అర్థం చేసుకుంటాయా? వారికి మెరుగైన జీవనాన్ని అందిస్తాయా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.