IND vs BAN : ఈ జట్టుతో వరల్డ్ కప్ ఎలా సాధిస్తారు ద్రావిడ్ సార్?

IND vs BAN : ఒక ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. ఒక ఓటమి గెలుపు దిశగా నడుపుతుంది. కానీ ఎన్ని ఓటములు ఎదురైనా కూడా భారత జట్టు తీరు మారడం లేదు. అలా అంటారేంటి.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో కప్ గెలుచుకుంది కదా అని మీరు అనవచ్చు. కానీ అక్కడ చివరి టి20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలుసుకోవాలి.. ఒకవేళ ఆ మ్యాచ్ గనుక జరిగి ఉంటే ఫలితం […]

Written By: Bhaskar, Updated On : December 4, 2022 8:38 pm
Follow us on

IND vs BAN : ఒక ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. ఒక ఓటమి గెలుపు దిశగా నడుపుతుంది. కానీ ఎన్ని ఓటములు ఎదురైనా కూడా భారత జట్టు తీరు మారడం లేదు. అలా అంటారేంటి.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో కప్ గెలుచుకుంది కదా అని మీరు అనవచ్చు. కానీ అక్కడ చివరి టి20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలుసుకోవాలి.. ఒకవేళ ఆ మ్యాచ్ గనుక జరిగి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక వన్డే సిరీస్ లో కూడా న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు ప్రదర్శన ఏమంత బాగోలేదు. మరీ ముఖ్యంగా మొదటి వన్డేలో అంతటి భారీ స్కోరు సాధించి కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం ఇప్పటికీ భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్నో ఓటములు

ఆసియా కప్ టి20 సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. పేరుకు స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కప్ గెలుచుకోవాల్సిన స్థితి నుంచి అనామకంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.. మొదటినుంచి కసితీరా ఆడిన శ్రీలంక జట్టు కప్ ఎగరేసుకుపోయింది. టి20 మెన్స్ వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో ఎదురైన పరాభవం ఇప్పటికీ భారత జట్టుకు ఒక పీడకల. ఇప్పట్లో దానిని ఏ ఒక్క అభిమాని కూడా మర్చిపోలేడు.

కీలక బౌలర్లు ఏరి స్వామి

భారత జట్టు కూర్పు విషయంలో ఒక దిశ దశ అంటూ లేదు. వరుస పెట్టి కెప్టెన్ లను మారుస్తున్న బీసీసీఐ సాధించిన ఫలితాలు ఏమిటో ఇప్పటికీ చెప్పదు.. పోనీ అలా చేయడంవల్ల గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ లేదా గొప్ప గొప్ప బౌలర్లు పుట్టుకొచ్చారంటే అదీ లేదు. ప్రయోగాల పేరిట ఎవరూ జట్టు కు స్థిరమైన కెప్టెన్ గా ఉండలేకపోతున్నారు. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన టి 20 సిరీస్ కి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించారు. వన్డే సిరీస్ కి శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.. ఇలా చేయడం వల్ల జట్టు ఏమంత లాభం సాధించిందో యాజమాన్యానికే తెలియాలి. కనీసం ఏ స్థితిలో ఉండి జట్టు కూర్పు చేస్తున్నారో కొంచెమైనా సోయి ఉందో లేదో అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇది ఆటా? ఇదే ఆటా?

టి20 మెన్స్ వరల్డ్ కప్ లో దారుణమైన పరాభవం తర్వాత సెలక్షన్ కమిటీలో మార్పులు చేర్పులు జరిగాయి. “36” బ్యాచ్ కు యాజమాన్యం విశ్రాంతి ఇచ్చింది. తర్వాత జట్టు న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళింది. మిశ్రమ ఫలితం వచ్చింది. సరే న్యూజిలాండ్ మైదానాలు అంటే బౌన్సీ పిచ్ లు. నాటి కపిల్ దేవ్ నుంచి నేటి రోహిత్ శర్మ దాకా భారత బ్యాట్స్మెన్ కు అవి ఎప్పటికీ కోరుకుడు పడవు. సరే వాటి విషయంలో మనం ఎంతో కొంత మినహాయింపు తీసుకున్నా… బంగ్లాదేశ్ మైదానాలపై ఎటువంటి వెసలు బాటు కోరుకోలేము. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఉపఖండంలో దేశమే కాబట్టి.. పెద్దగా భారత బ్యాట్స్మెన్ కు ఇబ్బంది ఉండదు. గతంలో జరిగిన టోర్నీలే ఇందుకు ఉదాహరణ. కానీ ఇవాళ జరిగిన మ్యాచ్లో అసలు ఆడుతోంది భారత జట్టేనా అనే అనుమానం కలిగింది. అసలు క్రీజ్ లోకి ఎందుకు వచ్చాం రా బాబూ అన్నట్టుగా భారత బ్యాట్స్మెన్ తీరు ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. వన్డే ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు బౌలర్లు భారత జట్టును 186 పరుగులకు ఆల్ అవుట్ చేశారంటే జట్టుకూర్పును చూసి, అలా ఎంపిక చేసిన వారిని చూసి జాలి పడటం తప్ప చేసేది ఏమీ ఉండదు.

ఎలా వరల్డ్ కప్ సాధిస్తారు

ధోని సారథ్యంలో 2011లో భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్ సాధించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అంటే ఒక పుష్కరం దాటిపోయింది. అయినప్పటికీ భారత జట్టుకు వరల్డ్ కప్ అనేది తీరని కలగానే మిగిలింది. ఇది ఒకటే కాదు ఐసీసీ నిర్వహిస్తున్న ఏ మెగా టోర్నీ లోనూ భారత జట్టు స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయడం లేదు. కెప్టెన్లు మారినా, కోచ్ లు మారినా పెద్దగా ఉపయోగం లేదు. పైగా ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళను ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాని విషయం. రిషబ్ పంత్, శిఖర్ ధావన్, కే ఎల్ రాహుల్( మొన్నటి దాకా ఫామ్ లేమితో బాధపడిన వాడే), వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ.. ఇలా ఆటగాళ్లు మొత్తం జట్టుకు భారమైన వాళ్లే. అయినా వీరి విషయంలో యాజమాన్యం ఎందుకంత ప్రేమ చూపిస్తుందో అర్థం కాని విషయం. ఇదే ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ అనే ఆటగాడు ఫామ్ లేమి తో బాధపడినప్పుడు అతడిని మరో మాట లేకుండా దూరం పెట్టారు. తనను తాను నిరూపించుకున్న తర్వాతే జట్టులోకి తీసుకున్నారు.. అది కూడా ఆటగాడిగా మాత్రమే.. అలా ఉంది కాబట్టే ఆస్ట్రేలియా ఇవాళ మంచి విజయాలు సాధిస్తోంది. అంతటి ఆస్ట్రేలియా టి20 సిరీస్ లో వెను తిరిగింది కదా అని మీరు అనవచ్చు. కానీ టి20 కప్ గెలిచిన ఇంగ్లాండ్ ను ఓడించి వన్డే సిరీస్ గెలుచుకుంది. అది కూడా వైట్ వాష్ ఫలితంతో… ఇలాంటి జట్టును ఇంకా కొనసాగిస్తే వరల్డ్ కప్ కాదు కదా.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కప్ కూడా భారత జట్టు గెలవలేదు. మనకు విజయాలు కావాలి అనుకుంటే మార్పులు జరగాలి. అవి జరుగుతూనే ఉండాలి. అప్పుడే మన జట్టు క్రికెట్ ను శాసించగలుగుతుంది. లేకుంటే అంతే సంగతులు.