Dharamshala Cricket Stadium: మనదేశంలో క్రికెట్ స్టేడియాలు చాలా ఉన్నాయి. ఈ స్టేడియాలలో అంతర్జాతీయ నుంచి మొదలుపెడితే జాతీయం వరకు మ్యాచులు జరుగుతూనే ఉంటాయి. మనదేశంలో చాలా స్టేడియాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఐకానిక్ గా పేరు తెచ్చుకున్నాయి. అందులో ప్రధానమైనది ధర్మశాల స్టేడియం.
ధర్మశాల స్టేడియం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ హిమాలయాలకు దగ్గరలో ఉంటుంది. అందువల్లే ఇక్కడ వాతావరణం ఎప్పటికీ చల్లగా ఉంటుంది. పైగా ధర్మశాల స్టేడియం కూడా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది. దీంతో ఇక్కడ ఆడేందుకు ప్లేయర్లు విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. పైగా ఇక్కడి వాతావరణం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ ఆడేందుకు ప్లేయర్లు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం విపరీతమైన చలి ఉంది. అక్కడ స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలోనే ధర్మశాల స్టేడియం మంచు కొండ మాదిరిగా మెరిసిపోతోంది. ధర్మశాల స్టేడియం చుట్టూ ధవలాదర్ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆ పర్వతాల మీద మంచు దుప్పటి మాదిరిగా పరచుకొని ఉంది. శీతల గాలులు వీస్తూ ఉండడంతో అక్కడి వాతావరణం మొత్తం ఒక్కసారిగా ఆంటార్కిటిక మాదిరిగా మారిపోయింది. ధర్మశాల స్టేడియం పూర్తిగా మంచుతో నిండిపోవడంతో దానికి సంబంధించిన ఫోటోలు విస్తృతంగా సామాజిక మాధ్యమాలలో దర్శనమిస్తున్నాయి.
వాస్తవానికి ఇలాంటి సన్నివేశాలు శీతల ప్రాంతాలకు దగ్గరగా ఉన్న స్టేడియాలలో కనిపిస్తాయి. అయితే ధర్మశాల స్టేడియం మంచుతో కనిపిస్తుండడంతో సరికొత్తగా దర్శనమిస్తోంది. దట్టంగా పరుచుకున్న మంచు.. ఆకాశాన్ని తాకే విధంగా కొండలు.. పచ్చని కోక కట్టినట్టుగా ఉన్న చెట్లు.. ధర్మశాల స్టేడియానికి సరికొత్త రూపం తీసుకొస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధర్మశాల స్టేడియం వెండి మాదిరిగా మెరిసిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఏడాది జరిగిన ఐపీఎల్లో ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ ను ఐపీఎల్ నిర్వాహకులు అర్ధాంతరంగా వాయిదా వేశారు. అప్పట్లో ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. స్టేడియంలో ముందుగా లైట్లను నిలుపుదల చేశారు. ఆ తర్వాత ప్రేక్షకులను విడతలవారీగా మైదానం నుంచి బయటికి పంపించారు.