Nitish Kumar Reddy: పై వ్యాక్యాలను ఆస్ట్రేలియాలో నిజం చేసి చూపించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. లేకపోతే పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ ఆటగాడు కమిన్స్ ను ఎలా అడ్డుకుంటాడు? స్టార్క్ ను ఎలా నిలువరిస్తాడు? బోలాండ్ ను ఎలా తుత్తునీయలు చేస్తాడు? లయన్ ను ఎలా ప్రతిఘటిస్తాడు? అది అతడి గుండె ధైర్యం.. ఇంతకంటే కొలమానం గొప్పగా అవసరం లేదు.. రోహిత్ వల్ల కానిది.. కోహ్లీ చూపించలేనిది.. పంత్ ప్రదర్శించలేనిది.. రాహుల్ విస్తరించలేనిది.. జైస్వాల్ నిలబెట్టుకోలేనిది.. ఇతడు చేసి చూపించాడు. ఆడుతోంది తొలి టోర్నీ అయినప్పటికీ.. వైట్ బాల్ గేమ్ విపరీతంగా ఆడుతున్నప్పటికీ..రెడ్ బాల్ పై కూడా తన సత్తా చాటాడు. అది కూడా జట్టుకు ఆపద్బాంధవుడు పాత్ర పోషించాడు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక సందర్భాల్లో నేనున్నాను.. నేను మాత్రమే ఉన్నాను అంటూ నిరూపించాడు.
ఆపద్బాంధవుడు..
పెర్త్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్ లో 41 రన్స్ చేశాడు. అవి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చాయి. అదృష్టవశాత్తు టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. ఆ టెస్టులో భారత్ ఏకంగా 295 రన్స్ తేడాతో గెలిచింది.. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఆ పరుగులు చేయకుండా ఉంటే టీమ్ ఇండియా పరిస్థితి మరో విధంగా ఉండేది.. ఇక ఇదే టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి 38 రన్స్ చేశాడు. అది కూడా 27 బంతుల్లోనే.. అంటే జట్టు కష్టాల్లో ఉంటే నిలబడగలను, జట్టు బలంగా ఉంటే.. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగలను అని నిరూపించాడు. అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో 42 పరుగులు చొప్పున నితీష్ కుమార్ రెడ్డి చేశాడు. అతడు చేసిన ఆ పరుగులు టీమిండియా కు ఇన్నింగ్స్ ఓటమిని దూరం చేశాయి. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. దిగ్గజ ఆటగాళ్లు విఫలమైన చోట అతడు బలంగా నిలబడ్డాడు . బలమైన ఆస్ట్రేలియా బౌలర్లను అంతే బలంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీలు చేయలేకపోయినప్పటికీ.. తన సత్తాను ప్రదర్శించాడు. అందువల్లే టీమిండియా కు ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ ఓటమి తప్పింది.
మెల్ బోర్న్ మైదానంలో..
మెల్ బోర్న్ మైదానంలో టీమిండియా ఒకానొక దశలో ఫాలో ఆన్ ఆడే ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 రన్స్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. శుక్రవారం నాడు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా నాట్ అవుట్ గా ఉన్నారు. కానీ శనివారం టీ బ్రేక్ సమయానికి పరిస్థితి మారిపోయింది. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియాను ఫాలో ఆన్ గండంలోకి నెట్టేస్తారని అందరు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా నిలబడ్డాడు. తన కెరియర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. టీమ్ ఇండియాకు ఫాలో ఆన్ గండం తప్పించాడు.. సహచర ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇదే క్రమంలో ఇదే ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ మూడో వికెట్ కు నెలకొల్పిన 102 పరుగుల భాగస్వామ్య రికార్డును బద్దలు కొట్టాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, స్మిత్ ఏడో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యం కొలిపారు. మరో పది పరుగులు చేస్తే వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఆ భాగస్వామ్య రికార్డు కూడా బ్రేక్ చేస్తారు.