
Newzeland vs Pakistan: పాకిస్తాన్ పై ఉగ్ర పడగనీడ పోవడం లేదు. ఆ దేశంలో విదేశీయులకు భద్రతపై భయం ఇంకా పోవడం లేదు. అప్పుడెప్పుడో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అది జరిగి 18 ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఏ అగ్రదేశం పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి వెళ్లడం లేదు. క్రికెట్ పేరుతో పర్యటించడం లేదు. దీంతో పాకిస్తాన్ యూఏఈ వేదికగానే మ్యాచ్ లు నిర్వహిస్తూ ఆడుతోంది.
తాజాగా 18 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చేసింది. రావల్పిండిలో ఈరోజు శుక్రవారం మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా అర్థాంతరంగా రద్దు అయ్యింది. భద్రతా కారణాలతో న్యూజిలాండ్, పాకిస్తాన్ ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అయ్యారు. దీంతో తొలి క్రికెట్ మ్యాచ్ ఈరోజు జరుగకుండా రద్దు అయ్యింది.
దీంతో ఆందోళన చెందిన న్యూజిలాండ్ క్రికెటర్లు, బోర్డు వెంటనే టూర్ ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగి మరీ న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడారు. అయినా కూడా ఆటగాళ్ల భద్రతమే తమకు ముఖ్యమని.. టూర్ ను న్యూజిలాండ్ బోర్డు రద్దు చేసింది. న్యూజిలాండ్ భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లను తమ దేశానికి పయనమవుతున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ క్రికెట్ కు గట్టి షాక్ లా మారింది. ఇక పాకిస్తాన్ లో క్రికెట్ మళ్లీ పునరుద్ధరణ జరగదని తేలిపోయింది.
న్యూజిలాండ్ భద్రతా కారణాలతో మ్యాచ్ లను రద్దు చేసుకోవడంతో ‘ఇక పాకిస్తాన్ క్రికెట్ ను న్యూజిలాండ్ చంపేసింది’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అక్తర్ ట్వీట్ చేశాడు. మరో క్రికెటర్ అఫ్రిది న్యూజిలాండ్ చర్యపై విమర్శలు గుప్పించాడు.
ఈ పరిణామం ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ కు నష్టం అని.. ఇక ఏ దేశం కూడా పాకిస్తాన్ లో పర్యటించబోదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.