IND VS NZ Test Match : కివీస్ చరిత్ర సృష్టించింది.. టీమిండియా పై 36 సంవత్సరాలు రికార్డును బద్దలు కొట్టింది..

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. శ్రీలంక చేతిలో 2-0 తేడాతో వైట్ వాష్ కు గురైంది. దీనికి తోడు కెప్టెన్ మార్పు.. ఏమాత్రం అంచనాలు లేకుండానే న్యూజిలాండ్ భారత్ లో అడుగుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 2:01 pm

IND VS NZ Test Match

Follow us on

IND VS NZ Test Match :  వరస టెస్ట్ సిరీస్ విజయాలతో జోరు మీద ఉన్న భారత జట్టును ఎదుర్కోవడం అంత సులభం కాదని మీడియాలో కథనాలు హోరెత్తిస్తున్న వేళ.. న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ ఆడింది. వర్షం వల్ల మొదటిరోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు మొగ్గు చూపించారు. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అది చాలా తప్పుడు నిర్ణయమని అతనికి అర్థం అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. కేవలం 46 పరుగులకే కుప్ప కూల్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ముందు భారత జట్టును నేలకు దించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగుల స్కోరు నమోదు చేశారు. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర (134), సీనియర్ ఆటగాళ్లు కాన్వే(91), టీం సౌథి(65) పరుగులతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 462 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (150), రిషబ్ పంత్ (99) పరుగులు చేసి సత్తా చాటారు. విరాట్ కోహ్లీ (70), రోహిత్ శర్మ (52) తమ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, ఓ రూర్కీ చెరో మూడు వికెట్లు సాధించారు. ఆజాజ్ పటేల్ 2 వికెట్లు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేయడం ద్వారా న్యూజిలాండ్ ఎదుట 108 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా న్యూజిలాండ్ ఎదుట ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర (39), యంగ్(48) పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. గెలుపు ద్వారా 36 సంవత్సరాల రికార్డులు న్యూజిలాండ్ జట్టు బద్దలు కొట్టింది. ఎందుకంటే ఆ జట్టు 1988లో భారత గడ్డపై చివరిసారిగా టెస్ట్ విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత విజయం సాధించడంతో న్యూజిలాండ్ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా భారత మూలాలు ఉన్న ఆటగాడు రచిన్ రవీంద్ర తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి భారత జట్టు పతనాన్ని శాసించాడు. న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బంగ్లా సిరీస్లో భారత జట్టు సాధించిన విజయంలో.. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన బౌలర్లు.. న్యూజిలాండ్ జట్టు పై మాత్రం తేలిపోయారు. తేమను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అది భారత జట్టు పతనాన్ని శాసించింది.