Hardik Pandya: సోషల్ మీడియాలో ఏకి పారిస్తున్నారు. బౌలింగ్ చేతకాదు. బ్యాటింగ్ వల్ల కాదు.. ఫీల్డింగ్ కు ఒళ్ళు వంగదు.. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం చేతకాదు. ఇతడుండగా ముంబై ఇండియన్స్ విజయం సాధించలేదు..ఇవీ సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా పై అభిమానులు చేస్తున్న కామెంట్స్. ఏ ముహూర్తాన ఇతడు ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడో.. అప్పటినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విమర్శలను చవి చూస్తున్నాడు. ట్రోల్స్ ను భరిస్తున్నాడు. అయినప్పటికీ అతని ఆట తీరు మారలేదు. బౌలింగ్ లో మెరుపులు లేవు.. బ్యాటింగ్ లో ఉరుములు లేవు. జట్టుకూర్పులో మార్పులు లేవు. ఫలితంగా ముంబై జట్టు ఈ ఐపీఎల్ 17వ సీజన్లో వరుస ఓటములు ఎదుర్కొంది.. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కు సోమనాథుడే దిక్కయ్యాడు.
వరుస ఓటములు.. విపరీతమైన విమర్శలు.. జట్టును గెలిపించకపోతే నాయకత్వం నుంచి తొలగిస్తామని ముంబై యాజమాన్యం బెదిరింపులు.. వీటికి తోడు దారుణమైన ట్రోలింగ్స్.. ఇన్ని అవరోధాల మధ్య.. హార్దిక్ పాండ్యాకు ఏమనిపించిందో.. తెలియదు గాని సోమనాథుడి దగ్గరికి వెళ్ళాడు. సోమనాథ లింగానికి పాలతో అభిషేకం చేశాడు. శివుడి శిరస్సుపై కొలువై ఉన్న గంగతో జలాభిషేకం చేశాడు. పూలతో అలంకరించాడు. అభిషేక ప్రియుడి ఎదుట సాక్షాంగపడ్డాడు. తెల్లటి వస్త్రాలు ధరించి.. నుదుటిన తెల్లటి విభూది పెట్టుకుని మొత్తానికి శివ భక్తుడయిపోయాడు.
హార్దిక్ పాండ్యా సోమనాథుడికి పూజలు చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడిన ముంబై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. తొలి మ్యాచ్ గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరుసటి మ్యాచ్ హైదరాబాద్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. రాజస్థాన్ జట్టు చేతిలో నగుబాటుకు గురైంది. ఇన్ని ప్రతికూలతల మధ్య.. ఆదివారం ఢిల్లీ జట్టుతో సొంత మైదానంలో ముంబై జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే హార్దిక్ పాండ్యాకు కొంతలో కొంత సాంత్వన. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాలి. అవసరమైతే కెప్టెన్సీ ని కూడా పోగొట్టుకోవాలి. పై వాటిల్లో చివరిదాన్ని భరించేందుకు హార్థిక్ పాండ్యా సిద్ధంగా లేడు.. అందువల్లే ఇన్ని కష్టాల నుంచి కాపాడాలని సోమనాథుడిని వేడుకున్నట్టున్నాడు.. మరి ఆ భోళా శంకరుడు హార్దిక్ పాండ్యాను కనికరిస్తాడా.. ముంబై జట్టును గెలిపిస్తాడా.. మరొక రోజులో తేలిపోతుంది.
Hardik Pandya offers prayers at Somnath Temple. pic.twitter.com/hZNIVQ3MH3
— Johns. (@CricCrazyJohns) April 5, 2024