Hardik Pandya : ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా విభిన్నంగానే కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కొన్ని జట్లు అప్రతిహత విజయాలను సాధిస్తున్నాయి..కోల్ కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఐపీఎల్ సీజన్ కు ముందు ఈ జట్టు మీద ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టు అనితర సాధ్యమైన విజయాలను సాధిస్తోంది. కోల్ కతా తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా వరుసగా మూడు విజయాలు సాధించింది. అయితే ఈ జట్ల రికార్డ్ ఇలా ఉంటే.. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టు చరిత్ర మరో విధంగా ఉంది. గత రెండు సీజన్లలో సరిగ్గా ఆడని ఆ జట్టు.. ఈసారి సీజన్లోనూ అదే తీరుగా ఆడుతోంది. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొని విమర్శలకు కారణమవుతోంది.
ఈ సీజన్ ప్రారంభానికి ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్ ను మార్చింది. రోహిత్ శర్మను పక్కనపెట్టి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. దీంతో ముంబై జట్టులో ఒక్కసారిగా విభేదాలు మొదలయ్యాయి. ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీనికి తోడు జట్టుకూర్పు ఏమాత్రం బాగోలేదు. పసలేని బౌలింగ్.. ఎప్పుడు కొడతారో.. ఎప్పుడు డీలా పడతారో తెలియని బ్యాటర్లు.. ఒళ్ళు వంచడానికి ఇష్టపడని ఫీల్డర్లు.. ఇలా అన్ని విభాగాలలో ముంబై జట్టు విఫలమవుతోంది.. కొత్త కెప్టెన్ నాయకత్వంలో జట్టు రాత మారుతుందని భావిస్తే.. అది ఇంకా నానాటికి తీసి కట్టులా మారుతోంది. దీంతో ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్ మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఇప్పటివరకు ముంబై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. అన్నింటిలోనూ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దారుణంగా బౌలింగ్ చేసింది. హైదరాబాద్ బ్యాటర్లు ముంబై పసలేని బౌలింగ్ లో ఏకంగా 277 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 246 పరుగులు చేసింది. 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 125 పరుగులు మాత్రమే చేసింది. సునయాస లక్ష్యాన్ని రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇలా వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోవడంతో.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
హార్థిక్ పాండ్యా కు సరిగ్గా కెప్టెన్సీ చేయడం రావడంలేదని ముంబై అభిమానులు విమర్శిస్తున్నారు. జట్టు యాజమాన్యం తీరును కూడా తప్పుపడుతున్నారు. రోహిత్ శర్మకు నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు విషయం ముంబై యాజమాన్యానికి అర్థమైనట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే రెండు మ్యాచ్ ల్లో ముంబై నెగ్గాలి, వ్యక్తిగతంగా రాణించాలని హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం సూచించినట్టు న్యూస్ 24 అనే న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రసారం చేసింది.. ఆ మ్యాచుల్లో నెగ్గకపోతే చర్యలు తీసుకుంటామని హార్దిక్ ను హెచ్చరించిందని.. ఆ న్యూస్ ఛానల్ తన కథనంలో పేర్కొంది. ఇక ముంబై జట్టు ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనుంది. ఏప్రిల్ 11న బెంగళూరు తో అదే మైదానంలో ముంబై జట్టు ఆడనుంది.. ఈ రెండు మ్యాచ్ లు ముంబై జట్టుకు అత్యంత కీలకం. ఇందులో గెలిస్తేనే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఉంటుందనే చర్చ జరుగుతోంది.