IPL 2025 : గొప్ప రేంజ్ ఉన్నప్పటికీ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ దాన్ని సరైన విధానంలో ప్రదర్శించలేకపోయాడు. అందువల్లే ఇప్పటి వరకు కూడా అతడు పెద్దగా మెరవలేకపోయాడు. అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అందువల్లే నేటికీ అతడు ఒక అనామక క్రికెటర్ లాగా ఉండిపోతున్నాడు. ఎత్తుకు ఎత్తు, వేగంగా బంతులు విసరగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ అతడు తన స్థాయిని ప్రదర్శించలేకపోతున్నాడు. తన కొడుకును తన అంతటి వాడిని చేయడానికి సచిన్ టెండూల్కర్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఉపయోగం లేకుండా పోతోంది. ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున అతడిని కొనుగోలు చేసినప్పటికీ.. సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో అతనికి తుది జట్టులో అవకాశాలు లభించడం లేదు. గత సీజన్లో లభించినప్పటికీ.. అప్పటికే ముంబై జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో సచిన్ కుమారుడు ఏదో అలా ఒక మ్యాచ్ లో మెరిశాడు.. పైగా ఆ మ్యాచ్ లోనూ అర్జున్ టెండూల్కర్ ఓవర్ యాక్షన్ చేశాడు. నెటిజన్ల చేతిలో తీవ్ర విమర్శలకు గురయ్యాడు..
అమ్ముడు పోలేదు.. ఆ తర్వాత కొనుక్కున్నారు
మొన్న, నిన్న జరిగిన ఐపిఎల్ వేలంలో ముంబై జట్టు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేయలేదు. 30 లక్షల బేస్ ప్రైస్ ఉన్నప్పటికీ అతడిని ఈసారి కొనుగోలు చేయడానికి ముంబై జట్టు ఇష్టాన్ని ప్రదర్శించలేదు. దీంతో సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్ పరువు పోయింది. సచిన్ కుమారుడు ఇంతటి దుస్థితిని అనుభవిస్తున్నాడు ఏంటని నెటిజన్లు వాపోయారు. అయితే చివరికి అర్జున్ టెండూల్కర్ ను ముంబై జట్టు కొనుగోలు చేసింది. వాస్తవానికి 9 గంటల 30 నిమిషాల వరకు అతడు అన్ సోల్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. గంట తర్వాత అంటే 10 గంటల 30 నిమిషాలకు అతడిని కొనుగోలు చేసినట్టు ముంబై జట్టు ప్రకటించడం విశేషం. దీనిపై సామాజిక మాధ్యమాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సచిన్ ఇజ్జత్ ను మరోసారి ముఖేష్ అంబానీ కాపాడడని నెటిజన్లు పేర్కొంటున్నారు. గతంలో కూడా అర్జున్ విషయంలో సచిన్ కలగజేసుకోవడం వల్లే ముంబై జట్టు కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే అర్జున్ రంజి ట్రోఫీలలో సత్తా చాటుతున్నప్పటికీ.. టి ట్వంటీ ఫార్మాట్ విషయంలో విఫలమవుతున్నాడు.. అంచనాలకు మించి రాణించలేకపోతున్నాడు. వికెట్లు పడగొట్టకపోగా.. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. అందువల్లే అతడు భావి స్టార్ బౌలర్ గా ఎదగలేకపోతున్నాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అర్జున్ తనలోపాలపై దృష్టి సారించాలని పేర్కొంటున్నారు.