MS Dhoni Local Vaidya: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏదీ చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. ఎవ్వరి ఊహకందని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళతాడు ధోని. టీమిండియాకు ప్రపంచకప్ లు అందించడంలోనూ.. ఐపీఎల్ లో చెన్నైని టాప్ లో నిలపడంలోనూ ధోని పాత్ర ఎంతో ఉంది. ఇక తాను ఆడలేనని అనుకున్నప్పుడు అంతే స్పీడుగా వైదొలిగి వారసులకు పగ్గాలు అప్పజెప్పే గొప్ప ధైర్యం ధోని సొంతం. అలానే టీమిండియా పగ్గాలు విరాట్ కోహ్లీకి.. అలాగే.. ఐపీఎల్ పగ్గాలు రవీంద్రజడేజాకు అప్పగించేశాడు.
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన జార్ఖండ్ డైనమేట్ గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. ధోని తలుచుకుంటే ప్రపంచంలోని ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనైనా చికిత్స తీసుకోవచ్చు. అంతటి డబ్బు, పరపతి ఆయన సొంతం. కానీ అలా కాకుండా రాంచీలోని ఓ మారుమూల గిరిజన తండాలో నాటు వైద్యాన్ని ఆశ్రయించాడు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రాచీన గిరిజన నాటు వైద్యంతో తన మోకాలికి చికిత్స తీసుకుంటున్నాడు.
ఐపీఎల్ లో చెన్నై తరుఫున ఆడుతున్నప్పటి నుంచి ధోనికి రెండు కాళ్లలో మోకాలి నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నాడు. కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవసరం ఉన్నా కూడా ధోని నాటువైద్యం చేయించుకుంటున్నారు. ఇందుకోసం ధోని ఏకంగా రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంపంగ్ లోని స్థానిక నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్దకు వెళుతున్నాడు.
ప్రతీరోజు 70 కి.మీల దూరం వెళ్లడం.. అక్కడ వనమూలికలతో చేసిన మందును తాగుతుండడం చేస్తున్నాడు. ధోని ఇప్పటికే నాలుగు డోసులు తీసుకున్నాడు. ఒక్కో డోస్ కు కేవలం 40 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.
ఇక మహీ శరీరంలో కాల్షియం లోపం ఉన్నందునే ఇలా జరుగుతోందని ఆ నాటు వైద్యుడు వందన్ సింగ్ చెబుతున్నారు. జూన్ 26వ తేదీ నుంచి ధోని ఈ నాటు వైద్యుడి డోస్ తీసుకుంటున్నాడు. స్వయంగా 70 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ లాంపంగ్ అనే ప్రాంతానికి వెళ్లి ఈ నాటు మందు తీసుకుంటున్నారు.
ఇక ధోనిని గుర్తుపట్టిన అక్కడి గిరిజన జనం అతడి చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ గిరిజన గూడాల్లో ధోని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.