Mohammad Hafeez: జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మంగళవారం జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత మన దేశం యావత్తు శోకసముద్రంలో మునిగిపోయింది. అన్ని వర్గాల ప్రజలు ఈ ఘటనను నిరసిస్తున్నారు. ఈ క్రమంలో మన దేశ క్రికెటర్లు కూడా తమ వంతు బాధ్యతగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నారు. అంతేకాదు ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నారు. ఇటువంటి ఘటన వాంఛనీయం కాదని పేర్కొంటున్నారు.
Also Read: పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్ర.. ఉగ్రవాదానికి బలమైన సమాధానం
ఒకే ఒక్క వాక్యంలో..
పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడిని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఖండించాడు. తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. అయితే అంతటి దారుణం జరిగితే ఒకే ఒక్క వాక్యంలో అతడు ముగించాడు. జరిగిన దాడి విచారకరం.. హృదయ విదారకం అంటూ పూర్తి చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉగ్రవాదుల మారణ హోమం వల్ల.. 28 మంది ప్రాణాలు కోల్పోతే.. ఒక మాజీ క్రికెటర్ ఇలా స్పందించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ” ఇదే మీ దేశంలో జరిగితే ఇలానే స్పందించేవారా? అసలు జరిగిన దాడికి ప్రధాన కారణం మీ దేశంలో పురుడు పోసుకున్న ఉగ్రవాద సంస్థ. అది తెలిసి కూడా మీరు ఏదో ముక్తాయింపుగా మాట్లాడారు. ఇది బాధిత ప్రజల హృదయాలను మరింత గాయపరుస్తుంది. ముందు మీరు మనిషిలాగా స్పందించడం నేర్చుకోండి. మనిషి పుట్టుక పుట్టిన వారు ఇలాగేనా స్పందించేది” అని అర్థం వచ్చే విధంగా నెటిజన్లు మండిపడుతున్నారు.. వాస్తవానికి ఈ ఘటనను మరో పుల్వామా లాగా భారత సైన్యం చెబుతోంది. భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనను అత్యంత తీవ్రంగా తీసుకుంది. ఇప్పటికే సమీప అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల జాడ కనుగొనేందుకు భద్రత దళాలు రంగంలోకి దిగాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి.. ఇక మనదేశంలోని క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు పహల్గాం దాడికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏ దశలో ఉన్నా ఉపేక్షించకూడదని.. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మన వైపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి పహల్గాం ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఉగ్రవాదాన్ని తుడిచిపెడతామని.. ఉగ్రవాదానికి భారత్ తలవంచదని.. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని” అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం ఘటనలో కన్నుమూసిన వారికి అమిత్ షా నివాళులర్పించారు. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెటర్ స్పందించిన తీరు పట్ల భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతమంది చనిపోతే ఒక్క వాక్యం లో సంతాపం తెలపడం పాకిస్తాన్ ఆటగాడి అసలు రూపాన్ని వ్యక్తం చేస్తోందని మండిపడుతున్నారు.
Sad & heartbroken #PahalgamTerroristAttack
— Mohammad Hafeez (@MHafeez22) April 23, 2025