Sunitha: ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా'(Padutha Teeyagaa) షో ఎన్నో ఏళ్ళ నుండి ఎంత అద్భుతంగా నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం సారథ్యం లో ఈ షో నడిచింది. ఆయన తదనంతరం తనయుడు ఎస్పీ చరణ్ సారథ్యం లో ఈ షో ప్రస్తుతం నడుస్తుంది. న్యాయ నిర్ణేతలుగా MM కీరవాణి(MM Keeravani), సింగర్ సునీత(Sunitha), రచయిత చంద్రబోస్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో ఒక కంటెస్టెంట్ గా వ్యవహరించిన ప్రవస్తి(Pravasthi) మూడు రోజుల క్రితం కీరవాణి, సింగర్ సునీత మరియు షో నిర్వాహకులపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మన అందరిఈ తెలిసిందే. షో లో కంటెస్టెంట్స్ పట్ల జడ్జీలు చాలా వివక్ష చూపిస్తున్నారని, నన్ను అయితే కనీసం ఒక మనిషి లాగా కూడా చూడడం లేదని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల ఆరోపణలు చేసింది.
Also Read: అప్పుడు చిరంజీవి..ఇప్పుడు సల్మాన్ ఖాన్..కాజల్ అగర్వాల్ కి వరుస అవమానాలు!
దీనికి సునీత కూడా నిన్న కౌంటర్ ఇచ్చింది. టాలెంట్ షోస్ ఎలా నిర్వహిస్తారో తెలిసి కూడా ఇలా ఆరోపణలు చేయడం సరికాదు, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని ఊహించలేదు, ఆమె చిన్న పిల్ల కాదు ముద్దు చేయడానికి, బాగా పాడితే మెచ్చుకుంటాము, లేదంటే తప్పులు చెప్తాము, ఛానల్ లో హక్కులు ఉన్న పాటలను మాత్రమే పాడాలి, ఈ విషయం కూడా తెలియకపోతే ఎలా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీనికి ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మీరు నన్ను ముద్దు చేయాల్సిన అవసరం లేదు, కనీసం మనిషిలాగ చూస్తే చాలు. నిన్న మీరు ఇన్ స్టాగ్రామ్ రీల్ లో ఎంతో పద్దతిగా మాట్లాడారు, నిజ జీవితం లో కూడా అలా మాట్లాడితే బాగుండేది మేడం. మీరు అలా నడుచుకొని ఉండుంటే నేను ఈరోజు ఇలా రోడ్డు మీదకు వచ్చే దానిని కాదు, ఇంత జరిగేది కాదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నేను చిన్నప్పుడు ఎలా పాడేదానినో, ఇప్పుడు అలా పాడడం లేదని మొన్న అన్నారు. అది మీ అభిప్రాయం, నేను తప్పుబట్టడం లేదు, గౌరవిస్తున్నాను. కానీ పాటల ఎంపిక గురించి కూడా అన్నారు, అది పక్షపాత ధోరణి చూపించడం కాదా మేడం. మీరు నిన్న చెప్పినట్టుగానే వీడియో రైట్స్ ఉన్న పాటలనే ఎంచుకొని మీ దగ్గరకు వచ్చాము, కానీ వాటిని మీరు నన్ను పాడనివ్వలేదు, రిజెక్ట్ చేసారు. అందుకు కారణం కూడా చెప్తాను, రాఘవేంద్రరావు గారి స్పెషల్ ప్రోగ్రాం లో భక్తి పాటలను ఎంచుకొని ప్రొడక్షన్ టీం కి పంపితే కుదరదని రిజెక్ట్ చేసారు. కానీ అవే పాటలు వేరే కంటెస్టెంట్స్ చేత పాడించారు. ఇది పక్షపాతం కాక మరేంటి?. పైగా ఆ పాట పాడిన అమ్మాయి మధ్యలో లిరిక్స్ మర్చిపోతే మీరు సైగలు చేసి, ఆమెకి లిరిక్స్ అందించి పాటలు పాడించారు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేడమ్’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.