LSG Vs CSK 2024: చెన్నై, లక్నో కెప్టెన్లను వదలని బీసీసీఐ.. ఇద్దరికీ పెద్ద బొక్క

ముందుగానే చెప్పినట్టు నిబంధనలు నిక్కచ్చిగా ఉండే క్రికెట్ లో.. కొంతమంది కెప్టెన్లు ఈ ఐపీఎల్లో బాధ్యతారాహిత్యంతో ఆడుతున్నారు. అయితే వారికి బీసీసీఐ ఘనమైన సన్మానమే చేస్తోంది. శుక్రవారం నాటి చెన్నై, లక్నో మ్యాచ్ లో అదే జరిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 11:57 am

LSG Vs CSK 2024

Follow us on

LSG Vs CSK 2024: ఆట ఆడగానే సంబరం కాదు.. దానికో పద్ధతి, వ్యవహారం ఉంటాయి. మరీ ముఖ్యంగా జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో నిబంధనలు నిక్కచ్చిగా ఉంటాయి. ఫీల్డ్ ఎంపైర్, లెగ్ సైడ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్, అడుగడుగునా కెమెరాలు.. వికెట్లకు ఆడియో రికార్డర్లు.. చాలా ఉంటాయి. అందుకే క్రికెట్లో వెంట్రుకవాసి తేడా జరగడానికి కూడా ఉండదు. పైగా క్రికెట్ కు అంతకంతకూ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తెరపైకి మరిన్ని నిబంధనలు వస్తాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఇలాంటి సమయంలో మైదానంలో ఆడే ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. కెప్టెన్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలని సూచిస్తున్నారు.

ముందుగానే చెప్పినట్టు నిబంధనలు నిక్కచ్చిగా ఉండే క్రికెట్ లో.. కొంతమంది కెప్టెన్లు ఈ ఐపీఎల్లో బాధ్యతారాహిత్యంతో ఆడుతున్నారు. అయితే వారికి బీసీసీఐ ఘనమైన సన్మానమే చేస్తోంది. శుక్రవారం నాటి చెన్నై, లక్నో మ్యాచ్ లో అదే జరిగింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్ లో ఇద్దరి కెప్టెన్లకు ఫైన్ పడింది. దీనికి కారణం స్లో ఓవర్ రేట్.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి ఓవర్లు వేయాలి. లేకుంటే బిసిసిఐ అస్సలు ఊరుకోదు. దీనికోసం ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటుంది.. ఇందులో ఏ ఆటగాడికి కూడా మినహాయింపు ఇవ్వదు. శుక్రవారం నాటి చెన్నై, లక్నో మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు నమోదయింది. ఈరోజు జట్ల కెప్టెన్లను ఇందుకు బాధ్యులను చేస్తూ బీసీసీఐ చెరో 12 లక్షల చొప్పున అపరాధ రుసుం విధించింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ కు ఫైన్ విధించింది. కాగా, ఈ మ్యాచ్ లో చెన్నై జట్టుపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ మైదానంలో తేమను చూసి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఆరు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ జడేజా 57*, మహేంద్ర సింగ్ ధోని 28* బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఇక 177 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో జట్టు 19 ఓవర్లలోనే పూర్తి చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపును ముద్దాడింది. లక్నో ఆటగాళ్లలో క్వింటన్ డికాక్ 54, కెప్టెన్ కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. దీంతో లక్నో జట్టు సులువుగా విజయం సాధించింది.