Rohit Sharma: ఐపీఎల్-24 సీజన్ అనేక సంచలన విషయాలకు వేదికయింది. మహేంద్ర సింగ్ ధోని టోర్నీ ప్రారంభానికి ఒకరోజు ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగించాడు. ఇక రోహిత్ శర్మ సమకాలికుడు విరాట్ కోహ్లీ ఎప్పుడు బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి ఎప్పుడో తప్పుకున్నాడు. వీరిద్దరి కంటే రోహిత్ శర్మది కాస్త భిన్నమైన కథ. ఇతడు గత సీజన్ వరకు ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించేవాడు. ఆ జట్టుకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ ను నిలిపాడు. గత రెండు సీజన్ లలో పేలవమైన ప్రదర్శనను సాకుగా చూపుతూ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై యాజమాన్యం తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది.
వాస్తవానికి రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటర్. సమర్థవంతమైన నాయకుడు కూడా. అతడి సమర్థతే ముంబై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపింది. మైదానంలో కెప్టెన్ గా కొన్నిసార్లు కోపంతోనూ.. మరికొన్నిసార్లు ఫ్రెస్ట్రేషన్ తోనూ రోహిత్ కనిపించేవాడు. అది కొంతమందికి నచ్చకపోయినా తను అలానే ఉండేవాడు. ఇక కెప్టెన్సీ భారం పూర్తిగా తొలగిపోవడంతో రోహిత్ శర్మ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల ప్రాక్టీస్ సమయంలో బ్యాటింగ్ సాధన చేశాడు. హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ ఇవ్వడంతో చాలామంది ఆటగాళ్లతో అతడు కలవడం లేదు.. బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లతోనే మాట్లాడుతున్నాడు.. ఇక గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ఫీలింగ్ చేయాలని హార్దిక్ పాండ్యా ఆదేశిస్తే.. నన్ను వెళ్ళమంటున్నావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన రోహిత్.. తర్వాత నింపాదిగా బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. ఒకవేళ నేను అక్కడ ఫీల్డింగ్ చేయడం ఏంటని రోహిత్ శర్మ ఎదురు ప్రశ్నిస్తే హార్దిక్ పాండ్యాతో పెద్ద వివాదం అయ్యేది. అదంతా ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ప్రశాంతంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేశాడు. అనంతరం చేజింగ్ లో తన మునుపటి దూకుడు చూపించాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. స్వేచ్ఛగా ఆడుతూ అత్యంత ప్రమాదకరంగా కనిపించాడు.
ఇక కెప్టెన్సీ భారం పోవడంతో సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో కుటుంబంతో పాల్గొన్నాడు. భార్య రితిక, సమైరా తో కలిసి సందడి చేశాడు. చాలా ఏళ్లుగా కెప్టెన్ గా ఉండి.. విపరీతమైన ఒత్తిడి అనుభవించిన రోహిత్ శర్మ.. తనకు తానుగా రిఫ్రెష్ అవుతున్నాడు. సరికొత్త అవతారాన్ని తన అభిమానులకు చూపిస్తున్నాడు. వచ్చే మ్యాచ్ లలో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడోనని అతడి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.