Goutham Ghambir: పెంట పెంట చేసేవాడు.. రచ్చ రచ్చ చేసేవాడు. ప్రతి విషయంలోనూ తల దూర్చి ఆటగాళ్లకు చుక్కలు చూపించేవాడు. దీంతో అతగాడి తాకిడి తట్టుకోలేక ఏకంగా విదేశీ కోచ్ వద్దనుకుంది టీం ఇండియా మేనేజ్మెంట్. పై ఉపోద్ఘాతం చదువుతుంటే గ్రెగ్ చాపెల్ గుర్తుకొస్తున్నాడు కదూ.. ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకంటే.. అక్కడిదాకా వస్తున్నాం జర ఆగండి.
టీమిండియాలో గ్రెగ్ చాపెల్(Greg Chapel) గురించి రెండు ముక్కలు చెప్పాలంటే ఓ విఫల అధ్యాయం. చాపెల్ తో పోల్చి చూస్తే ప్రస్తుత దేశీయ కోచ్ గౌతమ్ గంభీర్(Team India coach Gautam Gambhir) తక్కువ కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరు క్రికెట్ అభిమానులకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ఇటీవల భారత్ – పాకిస్తాన్ మధ్య దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ వ్యవహరించిన తీరు అనుమానానికి కారణమైంది.. దీనిపై సోషల్ మీడియాలో వైపరీతంగా చర్చ జరిగింది. గౌతమ్ గంభీర్ విభజించు పాలించు (Rule and Divide) అనే సూత్రాన్ని పాటిస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల దుబాయ్ లో లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ – పాకిస్తాన్ పోటీపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ క్రీజ్ లో అలా పాతుకపోవడం.. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చగొట్టే బంతులు వేసినా నిదానంగా ఉండడంతో.. ప్రత్యర్థి జట్టు మరో వంద పరుగుల టార్గెట్ విధించినా భారత్ గెలిచేదని అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేది. అయితే స్థిరంగా ఆడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారిగా అవుట్ అయ్యాడు. అప్పటికి విరాట్ కోహ్లీ 80 పరుగులకు మించి చేశాడు. చూడబోతే విరాట్ కోహ్లీ సెంచరీ చేసే విధంగా కనిపించాడు. టీమిండియాను గెలిపించే లాగా ఉన్నాడు. ఆ సందర్భంలో కేఎల్ రాహుల్ కు బదులుగా మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యను పంపించింది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా అక్కడ ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చి రాగానే పాండ్యా షాట్లు కొట్టాడు. గతంలో తిలక్ వర్మను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్న ఘనత హార్దిక్ పాండ్యాకు ఉంది. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీని సెంచరీ చేయకుండా హార్దిక్ పాండ్యా అడ్డు తగులుతాడని సగటు అభిమాని భావించాడు. అయితే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో.. అభిమానులు ఆ విషయాన్ని అక్కడితోనే వదిలిపెట్టారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ ఎటువంటి తప్పు చేయకుండా సింగిల్స్ మాత్రమే తీశాడు. కోహ్లీకి మాత్రమే స్ట్రైకింగ్ బాధ్యత అప్పగించాడు. అయితే పాండ్యా చేసిన నష్టాన్ని కోహ్లీ భర్తీ చేసుకున్నాడు. చివరి బంతికి బౌండరీ సాధించి సెంచరీ చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యాను పంపించాల్సిన అవసరం ఏముందని… హిట్టింగ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చ మొదలుపెట్టారు. అయితే అది మొత్తం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పని అని.. అతడికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉండదని.. అందుగురించే ఇలాంటి పనిచేసాడు అని విమర్శలు మొదలుపెట్టారు. “గ్రెగ్ చాపెల్ కాస్త నయం రా బాబూ.. గంభీర్ పగబట్టిన నాగుపాములాంటోడు.. జుట్టును ముంచడానికే వచ్చాడని” విరాట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.