చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ ఆట మధ్యలోనే పెవిలియన్ కు వెళ్ళాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ అందుకున్న తర్వాత ఇబ్బంది పడిన రాహుల్ గ్రౌండ్ ను వీడి వెళ్లిపోయాడు. అసలు ఎందుకు పోయాడు? కారణం ఏంటన్నది తెలియక మైదానంలోని ప్రేక్షకులు, టీవీ చూసేవారు కంగారుపడ్డారు.
చెన్నై చపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో ఇంటర్నేషనల్ వన్డే రసవత్తరంగా సాగుతోంది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల అందరి దృష్టి దీని మీద నిలిచింది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడి అదరగొట్టినా.. తరువాత తడబడింది. ఓపెనర్లు జట్టుకు శుభారంబాన్ని అందించినప్పటికీ.. టాపార్డర్ దాన్ని కొనసాగించలేకపోయింది. 10.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. మంచి జోరు మీద ఉన్న మిచెల్ మార్స్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 300కు పైగానే సాధిస్తుందని అంతా భావించారు.
దూకుడుగా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. అందుకు అనుగుణంగా ప్రణాళికాయుతంగా బ్యాటింగ్ చేసింది. ముందు దూకుడుగా ఆడాలని భావించిన ఆస్ట్రేలియా.. అందుకు అనుగుణంగానే మంచి ఫామ్ లో ఉన్న ట్రావెల్స్ హెడ్, మిచెల్ మార్ష్ లను ఒపెనర్లుగా పంపించింది. ఆడిన తొలి బంతి నుంచే మార్స్ దూకుడుగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఒకవైపు మార్స్ జోరుగా ఆడుతుంటే.. అదే రూటులోకి గేరు మారుస్తున్న క్రమంలో ట్రావెస్ హెడ్ 11 ఓవర్ 5వ బంతికి అవుట్ అయ్యాడు. దీంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నట్లయింది. జట్టు స్కోరు 68 పరుగులు వద్ద ఉన్నప్పుడు హెడ్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సెక్షర్లతో అప్పటికే 33 పరుగులు చేసిన హెడ్.. గేరు మార్చే క్రమంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ నిరాశపరిచాడు. పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. పాండ్యా వేసిన బంతిని డ్రైవ్ చేయబోయిన స్టీవ్ టైమింగ్ మిస్ అయి రాహుల్ చేతికి చిక్కాడు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 74 పరుగులు. కొద్దిసేపటికే 47 పరుగుల వద్ద మిచెల్ మార్స్ రూపంలో భారత్ కు మరో వికెట్ లభించింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 85 పరుగులు.
పెవిలియన్ కు చేరిన రాహుల్..
స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకున్న తర్వాత కీపర్ రాహుల్ ఎక్కువసేపు గ్రౌండ్లో నిలవలేకపోయాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక పోయాడు. డీహైడ్రేషన్ కు గురి కావడంతో మైదానంలో వికెట్ల వెనకాల నీరసంగా, చెమటతో తడిచిపోయి కనిపించాడు. 17వ ఓవర్ ముగిసిన తర్వాత విశ్రాంతి కోసం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. ఆ సమయంలో టి20 ఓపెనర్ ఇషాన్ కిషన్.. వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టాడు. 29వ ఓవర్లో కేఎల్ రాహుల్ మళ్లీ గ్రౌండ్ కు వచ్చి కీపింగ్ కొనసాగించాడు.
చెన్నైలో తీవ్రంగా ఎండ..
చెన్నైలో సాధారణంగానే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండటం వలన గాలిలో తేమశాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం 32 డిగ్రీల ఎండ కాచింది. తేమ శాతం 72 గా రికార్డు అయింది. గొంతు తడారిపోవడం, ఉక్కపోత, చెమట వల్ల కేల్ రాహుల్ ఇబ్బంది పడ్డాడు.