
Kapil Dev about Virat kohli : ఇప్పుడు టీమిండియాలో జోరుగా సాగుతున్న చర్చ కెప్టెన్సీ మార్పు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్ గా ఉన్న కోహ్లీ పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్నాడు. 2020లో ఒక్క సెంచరీకూడా చేయని కోహ్లీ.. 2021లోనూ ఇప్పటి వరకూ వంద పరుగులు సాధించిన ఇన్నింగ్స్ లేదు. దీంతో.. కెప్టెన్సీ మార్పుపై మొదలైన చర్చ.. ఇప్పుడు జోరుగా సాగుతోంది. త్వరలో.. కోహ్లీ నుంచి రోహిత్ (Rohit Sharma) బాధ్యతలు స్వీకరిస్తాడనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా హరికేన్, దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) ఈ విషయంపై స్పందించారు.
విరాట్ కోహ్లీ విఫలమవ్వడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ భారమవుతోందని చాలా మంది అంటున్నారు. నాయకత్వ బాధ్యతల కారణంగానే.. కోహ్లీ మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని అభిప్రాయ పడుతున్నారు. గడిచిన 22 నెలలుగా బ్యాటింగ్ లో గత ఫామ్ ను అందిపుచ్చుకునేందుకు కోహ్లీ తంటాలు పడుతూనే ఉన్నాడు. 2019 నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో చివరిసారిగా సెంచరీ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మూడంకెల స్కోరు చేయలేదు.
ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ రాణించలేకపోయాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన కోహ్లీ.. మొదట్నుంచీ తనదైన దూకుడుతో ఆడుతూ అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పటి వరకు 96 టెస్టులు ఆడిన కోహ్లీ.. 51 సగటుతో 7765 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలున్నాయి. 254 వన్డేలు ఆడిన విరాట్.. 43 సెంచరీలతో సత్తా చాటాడు. మొత్తంగా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు బాదాడు. 55.28 సగటుతో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు సాధించాడు.
ఇలాంటి కోహ్లీ.. రెండేళ్లు దగ్గర కావొస్తున్నా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీంతో.. కెప్టెన్సీ మార్చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. వన్డే కెప్టెన్సీ కోహ్లీకి ఉంచేసి.. టెస్టు పగ్గాలు రోహిత్ కు ఇవ్వాలనే వారి సంఖ్య గట్టిగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘అన్ కట్’ అనే షోలో మాట్లాడిన కపిల్.. విరాట్ కోహ్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు.
కెప్టెన్సీ కారణంగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టలేకోతున్నాడనే వారితో పూర్తిగా విభేదించాడు. కెప్టెన్సీ చేపట్టిన తొలినాళ్లలో కోహ్లీ ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేశారు. అప్పుడు ఎవ్వరూ ఈ మాట మాట్లాడలేదన్న కపిల్.. ఇప్పుడు ఫామ్ కోల్పోవడంతో కెప్టెన్సీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి కెరీర్లోనూ ఎత్తుపల్లాలు సహజమన్నారు. కోహ్లీ మునుపటి ఫామ్ అందుకుంటే.. సెంచరీ కాదు.. డబుల్ సెంచరీలతోపాటు ట్రిపుల్ సెంచరీ కూడా సాధించే సత్తా ఉందని అన్నాడు కపిల్.