ICC Test Rankings 2023: ఐసీసీ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ గా ఈసారికి అతడు..

ఫార్మాట్ కు తగ్గట్టు ఆడడంలో కేన్ విలియమ్సన్ ది ప్రత్యేక శైలి. టెస్ట్ మ్యాచ్ ఆడితే మాత్రం అసలు సిసలైన టెస్ట్ మజాను ఆడి చూపించడంలో కేన్ విలియమ్సన్ సిద్ధహస్తుడు.

Written By: Chai Muchhata, Updated On : July 5, 2023 3:20 pm

ICC Test Rankings 2023

Follow us on

ICC Test Rankings 2023: న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్ కెన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో విలియమ్సన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాడు. విలియమ్సన్ చివరిసారిగా నాలుగు నెలల క్రితం టెస్టు మ్యాచ్ ఆడినప్పటికీ మొదటి ర్యాంకు సాధించడం గమనార్హం. ఈ నాలుగు నెలల్లో న్యూజిలాండ్ బ్యాటర్ కు దగ్గరగా ఉన్న ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో విలియమ్సన్ మొదటి ర్యాంకు సాధించగలిగాడు.

న్యూజిలాండ్ క్రికెట్లో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాడు కేన్ విలియమ్సన్. అన్ని ఫార్మాట్లలో కూడా ఆ జట్టు బ్యాటింగుకు వెన్నుముకగా నిలుస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొద్దిరోజుల కిందట గాయపడిన కేన్ విలియమ్సన్ ప్రస్తుతం సర్జరీ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్సన్ మొదటి ర్యాంకును సాధించి సత్తా చాటాడు. గడిచిన నాలుగు నెలలు నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.

అసలు సిసలైన టెస్ట్ బ్యాటర్ గా రాణించే కేన్ విలియమ్సన్..

ఫార్మాట్ కు తగ్గట్టు ఆడడంలో కేన్ విలియమ్సన్ ది ప్రత్యేక శైలి. టెస్ట్ మ్యాచ్ ఆడితే మాత్రం అసలు సిసలైన టెస్ట్ మజాను ఆడి చూపించడంలో కేన్ విలియమ్సన్ సిద్ధహస్తుడు. కేన్ మామ వికెట్ తీయాలంటే బౌలర్లు ఆపసోపాలు పడాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి కేన్ విలియమ్సన్ క్రీజులో కుదురుకుంటే వికెట్ తీయడం చాలా కష్టం. ఇప్పటి వరకు 94 టెస్టు మ్యాచ్లు ఆడిన కేన్ విలియమ్సన్.. 54.89 యావరేజ్ తో 8124 పరుగులు చేశాడు. ఇందులో 251 అత్యధిక పరుగులు కాగా.. 28 సెంచరీలు, 33 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ కెరీర్ లో 50కు పైగా యావరేజ్ తో పరుగులు చేసిన అతి కొద్దిమంది ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు కావడం గమనార్హం.

గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న కేన్

కొద్దిరోజుల కిందట గాయపడిన కేన్ విలియమ్సన్ నడుముకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. గడిచిన నాలుగు నెలల నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అనేక దేశాలకు చెందిన ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లు భారీగా పరుగులు చేసినప్పటికీ కేన్ మామను దాటలేకపోయారు. ఈ జాబితాలో 883 పాయింట్లతో కేన్ విలియమ్సన్ ప్రథమ స్థానంలో ఉండగా, 882 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు మార్నస్ లబు చేంజ్ 873 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే, మరో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 872 పాయింట్లుతో నాలుగో స్థానంలో, 866 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్ మధ్య ఉన్న పాయింట్ల వ్యత్యాసం ఒకే ఒక్క పాయింట్ కావడం గమనార్హం. అయితే, కేన్ విలియమ్సన్ నాలుగు నెలల నుంచి క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టెస్ట్ బ్యాటర్లు జాబితాలో టాప్ ఫైవ్ లో ఉన్న ఆటగాళ్లలో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఉండటం విశేషం.