Jasprit Bumrah: బుమ్రా మనదేశంలోనే కాదు, విదేశాలలో కూడా అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అందువల్లే అతడిని బుమ్ బుమ్ బుమ్రా అని పిలుస్తుంటారు. అయితే ఇటీవల రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శాశ్వతంగా తప్పుకొన్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రా కు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా సంస్థలు కూడా అదే విధంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే చివరికి మేనేజ్మెంట్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎంతో టాలెంట్ ఉన్న బుమ్రా ను కాదని గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం దిగ్గజ ఆటగాళ్లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దీనిపై మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ అది అస్పష్టమైన సమాధానంగానే మిగిలిపోయింది. అయితే ఈ వ్యవహారంపై తొలిసారిగా బుమ్రా నోరు విప్పాడు. ఓ క్రీడా ఛానల్ తో అతడు తన మనో గతాన్ని పంచుకున్నాడు..
” సుదీర్ఘ ఫార్మాట్లో సారథిగా కొనసాగడానికి నేను ఇష్టపడలేదు. రోహిత్, విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు పలకకముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి తో మాట్లాడాను. ఇక ఆంగ్లజట్టుతో జరిగే ఐదు సుదీర్ఘ ఫార్మాట్ ల సిరీస్లో పనిభారం గురించి కూడా చర్చించాను. నాకు మద్దతు ఇచ్చే వారి గురించి కూడా చర్చించాను. ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫోన్ చేసి చెప్పాను. నాయకత్వ పాత్రలో నేను ఉండలేనని స్పష్టం చేశాను. ఎందుకంటే నేను అన్ని టెస్ట్ మ్యాచులు ఆడలేను. నేను ముందుండి జట్టుకు మార్గ నిర్దేశం చేసే విషయంలో న్యాయం చేయలేకపోవచ్చని వివరించాను. నా అభిప్రాయాలతో వారు ఏకీభవించారని” బుమ్రా చెప్పుకొచ్చాడు. దీంతో టెస్ట్ కెప్టెన్సీ బుమ్రా ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది.. అంతేకాదు మేనేజ్మెంట్ గిల్ విషయంలో ఎందుకు ఆసక్తి చెప్పిందనే దానిపై కూడా స్పష్టత వచ్చింది.
ఆరోగ్యం సరిగ్గా లేదా
బుమ్రా కొంతకాలంగా అనారోగ్యం బారిన పడుతున్నాడు. అతడి వెన్నెముక తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. అందువల్లే గతంలో అతడికి శస్త్ర చికిత్స జరిగింది. గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లోను అతడు ఇబ్బంది పడుతూనే బౌలింగ్ వేశాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబై జట్టులోకి కూడా ఆలస్యంగా ప్రవేశించాడు. ఇప్పుడిక ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ లో ఆడుతున్నప్పటికీ.. అతడు ఐదు టెస్టులు ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇదే విషయాన్ని బుమ్రా కూడా చెప్పేశాడు. అలాంటప్పుడు భారత్ ప్రత్యామ్నయం వెతుక్కోవలసిన అవసరం ఉంది.