Homeక్రీడలుJasprit Bumrah : జస్ ప్రీత్ బుమ్రా ఇచ్చి పడేయాల్సిందే.. అదే జరిగితే ఇంగ్లీష్ గడ్డపై...

Jasprit Bumrah : జస్ ప్రీత్ బుమ్రా ఇచ్చి పడేయాల్సిందే.. అదే జరిగితే ఇంగ్లీష్ గడ్డపై తోపు అతడే!

Jasprit Bumrah : గాయాల బారిన పడినప్పటికీ.. వెన్నునొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. సుదీర్ఘకాలం నేషనల్ క్రికెట్ అకాడమీకి పరిమితమైనప్పటికీ.. ఇటీవల కాలంలో మళ్ళీ అతడు క్రికెట్ ఆడుతున్నాడు. ఈ మధ్య ముగిసిన ఐపిఎల్ లో ముంబై జట్టు తరఫున అద్భుతమైన ప్రతిభ చూపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన వేగవంతమైన బౌలింగ్ వేసి అదరగొట్టాడు. ఎక్కువ వికెట్లు తీయడంతో పాటు.. తక్కువ పరుగులు ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం ఉన్న ఆటగాడిగా అతడి పేరు మార్మోగిపోయినప్పటికీ.. చివరి దశలో అతడికి ఆ అవకాశం లభించలేదు. దీంతో గిల్ కు నాయకత్వ బాధ్యతలు లభించాయి. గిల్ సారధ్యంలోనే భారత జట్టు ఆంగ్లేయుల గడ్డమీద అడుగు పెట్టింది. త్వరలో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతుంది. ఇక ఈ సిరీస్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకోవడానికి జస్ ప్రీత్ బుమ్రా సిద్ధంగా ఉన్నాడు. అతడు గనుక ఈ సిరీస్ లో చెలరేగిపోతే.. భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచిపోతాడు..

ఆంగ్లేయుల గడ్డమీద జరిగిన మ్యాచ్లలో భారత జట్టు తరఫున జస్ ప్రీత్ బుమ్రా 14 టెస్టులు ఆడాడు. మొత్తంగా 30+ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ 22 టెస్ట్ మ్యాచ్ లు ఆడి.. 105 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. సుదీర్ఘ ఫార్మాట్ లో ఆంగ్లేయుల జట్టుపై 50 వికెట్ల ఘనతను సాధించడానికి జస్ ప్రీత్ బుమ్రా కొంత దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇటీవల కంగారు గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ.. ఆ సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇంగ్లాండ్ మైదానాలు కూడా కంగారు దేశంలో ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ లెక్కన చూస్తే జస్ ప్రీత్ బుమ్రా ఆంగ్లేయుల గడ్డమీద అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో జస్ ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. నిలకడగా ప్రదర్శన చేస్తూ వికెట్లు సాధిస్తున్నాడు.

Also Read : కెప్టెన్ కావాల్సినవాడు.. సాధారణ ఆటగాడయ్యాడు.. బుమ్రా కెరియర్ క్లోజేనా!

ఇంగ్లాండ్ మైదానాలు స్వింగ్, సీమ్ కు అనుకూలంగా ఉంటాయి. వీటిని గనక జస్ ప్రీత్ బుమ్రా వినియోగించుకుంటే తిరుగు ఉండదు. స్లో బంతులు, యార్కర్లు, నిప్పులు జరిగే పేస్ బాల్స్ వేయడంలో జస్ ప్రీత్ బుమ్రాకు తిరుగులేదు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లను సైతం అతడు ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించగలడు. అటువంటి బ్యాటర్లను అనేక సందర్భాలలో వెనక్కి పంపించాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో జస్ ప్రీత్ బుమ్రా ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా ఆవిర్భవించాడు.. 110 సంవత్సరాల సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో అత్యుత్తమ సగటు నమోదు చేస్తూ.. 150 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆంగ్లేయుల మైదానాలు భారత పేస్ బౌలర్లకు సవాళ్లు విసిరాయి. వీటన్నింటినీ జస్ ప్రీత్ బుమ్రా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆంగ్లేయుల గడ్డపై వికెట్ల వేటలో దూసుకుపోయాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇంగ్లీష్ గడ్డపై 50 వికెట్ల మైలురాయి అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారత్ తరపున ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు వీరే

ఇషాంత్ శర్మ 48 వికెట్లు
కపిల్ దేవ్ 43 వికెట్లు
జస్ ప్రీత్ బుమ్రా 37 వికెట్లు
అనిల్ కుంబ్లే 36 వికెట్లు
బిషన్ సింగ్ బేడి 35 వికెట్లు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version